Pemmasani Chandra Sekhar: విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని
AMRUT Scheme | కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్‌లో భాగంగా విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్లను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Pemmasani Chandra Sekhar | తెనాలి: దేశంలోని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి చేసే లక్ష్యంతో అమృత్ పథకాన్ని (AMRUT Scheme) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ పథకం కింద గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. తెనాలి రైల్వే స్టేషన్ (Tenali Railway Station)ను సందర్శించిన మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి అక్కడి అభివృద్ధి పనులను సమీక్షించారు. మొదటి దశ పనులను డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్థానికులు తెలియజేసిన సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంపై తక్షణం స్పందించిన మంత్రి పెమ్మసాని
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడిన సమయంలో, అదే దారిలో ప్రయాణిస్తున్న మంత్రి వెంటనే స్పందించారు. గాయపడిన వ్యక్తిని ఎయిమ్స్‌లో చేర్పించడంతో పాటు, అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
తాడికొండ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్న కేంద్ర మంత్రి
తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు గ్రామంలో నిర్వహించిన ‘సుపరిపాలన - తొలి అడుగు’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి అంశాలపై సమీక్ష జరిపారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు. తాడికొండ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.






















