Paritala Sunitha: 20 ఇయర్స్ జైలు ప్లానింగ్ అంటే హత్యలు చేస్తావా ప్రకాష్ రెడ్డి.. ఎమ్మెల్యే పరిటాల సునీత
జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. హత్యలు చేస్తావా ఏంటి అని ప్రశ్నించారు.

Raptadu Ex MLA Thopudurthy Prakash Reddy | రాప్తాడు: 20 సంవత్సరాల పాటు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బహిరంగంగా మాట్లాడుతున్నారంటే.. మళ్లీ హత్యలు చేసేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఆమె తీవ్రంగా స్పందించారు. తన క్యాంప్ కార్యాలయంలో పరిటాల సునీత మాట్లాడుతూ.. 20 ఏళ్లు జైలులో ఉండాలంటే హత్యలు చేసే వెళ్లాలి.. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకొని జాగ్రత్తగా ఉండు ప్రకాష్ రెడ్డి అంటూ హెచ్చరించారు. మేము నీలాగా ఆలోచిస్తే.. నువ్వు ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతావా అని ప్రశ్నించారు. గతంలో జరిగిన చరిత్రను వక్రీకరిస్తూ... మీ పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నావంటూ మండిపడ్డారు.
పరిటాల రవి గురించి ఈ ప్రాంతానికి బాగా తెలుసు
పరిటాల రవి తన ప్రాంతానికి ఏం చేశారు.. ప్రజలకు ఎలాంటి పరిస్థితుల్లో అండగా నిలిచారన్నది ఎవర్నడిగినా చెబుతారన్నారు. నువ్వు చేసిన పాపాలు పండాయని.. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మా ప్రభుత్వంలో అంతా చట్ట ప్రకారం ఉంటుంది కాబట్టే.. నీ జైలు బాటకు కాస్త సమయం పడుతోందన్నారు. మేము నీలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. దౌర్జన్యాలు, దోపిడీలు చేయలేదన్నారు. నన్ను చూసి ప్రజలు, టీడీపీ నాయకులు భయపడటం లేదని.. తప్పు చేసి నీలాగా తప్పించుకుని తిరుగుతున్న వారే భయపడుతున్నారన్నారు.
తప్పులు చేసి, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడే వారికి ఎప్పటికీ నేను నా కుమారుడు సింహస్వప్నమేనని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అది మాకు పరిటాల రవి నుంచి వారసత్వంగా వచ్చిందన్నారు. మేము ఎవర్నైనా బెదిరించి ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. రైతుల గురించి ప్రేమ ఒలకబోస్తున్న నువ్వు ఐదేళ్లలో ఎందుకు పేరూరు ప్రాజెక్టు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని నిలదీశారు. రాక్రీట్ సంస్థ ద్వారా పేదలు, ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేసి.. ఇప్పుడు తగుదనమ్మా అంటూ బయలుదేరావని విమర్శలు చేశారు. ఇప్పటికైనా హత్యా రాజకీయాలు, రెచ్చగొట్టే చర్యలు మానుకుని.. ప్రజలకు ఏం చేస్తున్నామన్న దానిపై మాట్లాడితే బాగుంటుందని సునీత హితవు పలికారు.
మహిళల్ని కించపరిచిన వారికి పరామర్శలా
మాట్లాడితే విలువలు - విశ్వసనీయత అనే మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మహిళా ఎమ్మెల్యేను సభ్య సమాజం తలదించుకునేలా ఒక వ్యక్తి మాట్లాడితే.. అతన్ని పరామర్శించేందుకు నెల్లూరు జిల్లాకు వెళ్లారని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని ఎందుకు పరామర్శించేందుకు వెళ్లావో సూటిగా సమాధానం చెప్పగలవా అంటూ నిలదీశారు. పైగా అక్కడికి వెళ్లి నిస్సిగ్గుగా ప్రభుత్వంపై నిందలు వేసిన జగన్ రెడ్డి తీరు చూసిన మహిళలు అసహ్యించుకున్నారన్నారు. మహిళలను గౌరవించలేని వైసీపీ పార్టీని చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని.. ఒక్క సారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఆస్తి కోసం తల్లి, చెల్లి మీద వేసిన కేసులో విజయం సాధించిన వీరుడు లా కనీసం మానవత్వం లేకుండా ప్రచారం చేసుకుంటున్న నీకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయా అని నిలదీశారు. ఆయన పత్రికలో వస్తున్న వార్తలు చూస్తుంటే జనం అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
బంగారుపాళ్యంలో రైతుల కష్టం మామిడి కాయలు దొంగలించి, తొక్కించిందే చాలక మద్దతు ధర లేక రైతులు పారబోశారంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. పరిశ్రమలకు భూములు కేటాయించినా, ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నా, మద్యం కుంభకోణంలో వైసీపీ నాయకులు అడ్డంగా నోట్ల కట్టలతో దొరికినా, అరాచకాలతో ఐదేళ్లు వైసీపీ నేతలు పేట్రేగిపోయినా ఒక్క రోజైనా మీ పత్రికలో వార్త వచ్చిందా అంటూ నిలదీశారు. అసలు జగన్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీకి సంబంధించిన కరపత్రిక సాక్షి వరకు ఆ పార్టీలో వారికి ఎవరికీ విలువలు, విశ్వసనీయత లేవని సునీత అన్నారు.





















