Pawan Kalyan Politics: టీడీపీకి అభివృద్ధి, IT- వైసీపీ అంటే సంక్షేమం, BRSకి రాష్ట్ర సాధన.. జనసేన మార్క్ మిస్సింగ్
Andhra Pradesh Politics | టీడీపీ అంటే అభివృద్ధి, IT.. వైసీపీ అంటే సంక్షేమం గుర్తొస్తుంది. BRS అంటే ప్రత్యేక రాష్ట్ర సాధన, సంక్షేమం. మరి పవన్ కళ్యాణ్ జనసేన మార్క్ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.

Janasena Party Politics | జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి గానీ ఆయనకున్న క్రేజ్ గురించి గానీ ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. నిజం చెప్పాలంటే ఆయన ఫ్యాన్స్ కు ఆయన ఒక దేవుడు. అంతటి కల్ట్ ఫాలోయింగ్ ఉన్నవాళ్లు రాజకీయాల్లోగానీ సినిమాల్లో గానీ చాలా తక్కువ. గత ఎన్నికల్లో విజయం సాధించి కూటమి అధికారం లోకి రావడంలో జనసేన పాత్ర చాలా ఎక్కువ. ఈ విషయం స్వయంగా చంద్రబాబే చాలాసార్లు చెప్పారు. అయితే ప్రభుత్వం ఏర్పడ్డాక పాలన లో జనసేన ఆ స్థాయి దూకుడు చూపిస్తుందా అంటే లేదనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. కారణం Pawan Kalyan తనకంటూ ఒక ప్రత్యేకమైన పాలసీ ఏర్పరచుకోలేకపోవడమే అంటారు విశ్లేషకులు.
టీడీపీకి మార్క్ "డెవలప్ మెంట్ & IT "
ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ కి అభివృద్ధి, IT రంగాలు తనదైన మార్క్ గా నిలిచాయి. 90ల్లో అప్పుడప్పుడే మొదలవుతున్న న్యూ ఏజ్ పాలిటిక్స్, కార్పొరేట్ రివల్యూషన్, IT గ్రోత్ లను కరెక్ట్ గా అందిపుచ్చుకోగలిగింది టిడిపి. దానికి నిదర్శనమే నేటి సైబరాబాద్. ఎన్నికల సమయాల్లో ఎన్ని విమర్శలు చేసుకున్నాగానీ విపక్షాల సైతం ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అంటే చంద్రబాబు పేరు గుర్తొచ్చేలాగా ఐటీ ని డెవలప్ చేసింది టీడీపీ.IT బూమ్ మొదలైన 35 ఏళ్ల తర్వాత కూడా టిడిపి దాన్నే క్లైమ్ చేసుకుంటోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో గానీ, మొన్నటి 2024 ఎన్నికల్లో గానీ ఆంధ్ర ప్రజలుటీడీపీ కి పట్టం కట్టారంటే ఏపీ ని డెవలప్ చేస్తారనే అభిప్రాయం ఎక్కువమందిలో ఉండటమే. ఇప్పుడు రెండు మూడు దశాబ్దాలు గడిచినా టిడిపి మార్కంటే అభివృద్ధి అనే ఆ పార్టీ ప్రొజెక్ట్ చేసుకుంటుంది అనేది కాదనలేని వాస్తవం
వైసీపీ అంటే "సంక్షేమం "
2019 నుండి 2024 వరకూ ఏపీని పాలించిన వైసీపీ " సంక్షేమాన్ని" తన మార్క్ గా చేసుకుంది. బహుశా దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల చేతుల్లో డబ్బులు ఉండేలా ఆ పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. జగన్ ప్రవేశపెట్టిన "అమ్మ ఒడి", "రైతు భరోసా" లాంటి పథకాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదో ఒక రూపం లో కచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటేనే ఆ పథకాలు ప్రజల్లోకి ఎంతలా వెళ్లిపోయాయి అనేది అర్థమవుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో అప్పుడు తెచ్చాను సరే సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. "అభివృద్ధి ని పక్కన పెట్టారు, మూడు రాజధానుల పేరుతో తెనాలిలో లేనిపోని కన్ఫ్యూజన్ సృష్టించారు" అనే తీవ్రమైన విమర్శల నేపథ్యంలోనూ 40% ఓటు షేర్ లభించింది అంటే వైసిపి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే అనడం లో ఏమాత్రం అనుమానం లేదు.
ప్రత్యేక రాష్ట్రం సాధకులు -TRS (BRS) నేతలు
తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ప్రత్యేక రాష్ట్రం సాధించింది కేసీఆర్ అనే పేరు నిలిచిపోతుంది అంటారు బిఆర్ఎస్ నేతలు. అంతలా ఆ పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధనను తన మార్కుగా చేసుకుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తామే అంటూ కాంగ్రెస్, తెలంగాణ బిల్లు కు సహకరించింది తామే అంటూ బీజేపీ ఎంతెలా చెప్పుకున్నా.. దానిలో ఎంతో కొంత వాస్తవం ఉన్నా గానీ దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చింది మాత్రం కెసిఆర్ పోరాటమే అనే ఫీలింగ్ సామాన్య తెలంగాణ ప్రజల్లో చాలా బలంగా పాతుకుపోయింది. అందుకే మిగతా విషయాల్లో ఎలా ఉన్నా తెలంగాణ సాధన విషయంలో కెసిఆర్ పాత్ర ను తక్కువ చేసే ధైర్యం చేయవు ఇతర పార్టీలు.
మరి జనసేన మార్క్ ఏంటి?
అధికారం లోకి వచ్చిన ప్రతీ ప్రాంతీయ పార్టీ పాలన లో తనదైన ఒక మార్కును క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఎన్నికల్లో అదే అత్యంత కీలకంగా మారుతోంది. ప్రస్తుతం జనసేన ఆ విషయంలో ఫెయిల్ అవుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో చాలా ఎక్కువగా నడుస్తోంది. ప్రస్తుతం పవన్ ' సనాతన ధర్మ పరిరక్షణ ' అనే స్టాండ్ తీసుకున్నా అది 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తీసుకున్న నిర్ణయం. అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్లిందనేది తెలియాలంటే 2029 ఎన్నికల ఫలితాల వరకూ ఆగాలి. మరి అంతవరకు జనసేన తనదైన మార్క్ ఇది అని చెప్పుకోవడానికైతే ఏమీ లేకుండా పోయిందనేది సగటు జనసేన నాయకుడి అభిప్రాయం.
ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అటు మొత్తం కూటమి ఖాతాలోకో లేక టీడీపీ ఖాతా లోకో వెళ్ళిపోతున్నాయి గానీ "ఇది జనసేన కార్యక్రమం లేదా జనసేన ఇనిషియేటివ్ " అని చెప్పుకునే పాలసీ గానీ ప్రోగ్రామ్ గాని ఇంతవరకు ప్రజల్లోకి వెళ్ళలేదు. కచ్చితంగా జనసేన అధినాయకత్వం దృష్టిపెట్టాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటర్ ఆలోచించే విషయం ఇది. దానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి జనసేన థింక్ ట్యాంక్ దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.





















