Leopard in Srisailam: భక్తులకు అలర్ట్ - ఇంకా శ్రీశైలం పాత మెట్ల మార్గంలో చిరుతపులి సంచారం
Leopard Spotted in Srisailam: శ్రీశైలంలో చిరుతపులి ఇంకా సంచరిస్తుందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమ ఇళ్లలోకి రాకుండా చూడాలని అటవీశాఖ అధికారులను కోరారు.
శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్‌లో ఏదో చోట ఎలుగుబంటి, చిరుతపులి సంచారం, లేకపోతే ఏనుగుల గుంపు పొలాల్లోకి వచ్చి నాశనం చేయడం తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలకం రేపింది. శ్రీశైలం పాతాళ గంగ పాత మెట్ల మార్గం వెళ్లే చోట చిరుతపులి సంచరించింది. పాత మెట్ల మార్గం ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో నుంచి ఓ చిరుతపులి బయటకు వచ్చింది. రోడ్డు వద్ద డివైడర్ పైకి రావడంతో అటుగా వెళ్తున్న వారు ఆ చిరుతపులిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరుత అక్కడ సంచరించే అవకాశం ఉన్నందున భక్తులు, అటువైపుగా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
సుమారు 30 నిమిషాలపాటు చిరుతపులి డివైడర్ పై ఉండి, అటు ఇటూ చూసింది. అటుగా వెళ్తున్న కొందరు చిరుతను తమ సెల్ ఫోన్ లో వీడియోలు, ఫొటోలు తీశారు. కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి జనసంచారం లోకి వచ్చి పాళాళగంగ పాత మెట్ల మార్గంలో సంచరించడంంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో చిరుత సంచరించింది. అధికారుల సూచన మేరకు స్థానికులు గట్టిగా డోలు శబ్ధాలు చేయడంతో అటవీలోకి వెళ్లిపోయేవి. చాలా రోజుల తరువాత చిరుతపులి అక్కడ సంచరించడంతో.. తమ నివాస ప్రాంతాలలోకి రాకుండా చూడాలని అటవీశాఖ అధికారులను స్థానికులు కోరారు. భక్తులు, ఆ వైపు వెళ్తున్నవారు ముఖ్యంగా రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం అధికారులు, అటవీశాఖ అధికారులు సూచించారు.
తిరుమలలోనూ తరచుగా మెట్ల మార్గంలో చిరుతలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని నెలల కిందట నరసింహ స్వామి చుట్టుపక్కల పదే పదే చిరుతుల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేసింది. ఓ చిన్నారిని సైతం చిరుత అడవిలోకి లాక్కెళ్లి చంపేయడం తెలిపిందే. ఆపై అధికారులు పటిష్ట చర్యలు తీసుకుని, బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటిగా కొన్ని చిరుతలను బంధించి అడవిలో వదిలారు. కొన్ని జూకు తరలించడం తెలిసిందే.