Devaragattu Banni Utsav: దేవరగట్టులో కర్రల సమరం... బన్ని ఉత్సవాల్లో చెలరేగిన హింస.. వంద మందికి గాయాలు
దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవం యుద్ధాన్ని తలపించింది. అర్ధరాత్రి మాళ మల్లేశ్వర స్వామి కల్యాణం అనంతరం జరిగిన జైత్రయాత్రలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి తలలు పగిలేలా కొట్టుకున్నారు.
కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలు శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవంలో చెలరేగిన హింసలో సుమారు వంద మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల వారు ఓ వైపు, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు మరోవైపు రెండు వర్గాలుగా ఏర్పడి కర్రలతో తలపడతారు.
జైత్రయాత్రలో చెలరేగిన హింస
కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం శుక్రవారం అర్ధరాత్రి ఉద్విగ్నభరితంగా ప్రారంభమైంది. ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా హింస చెలరేగింది. దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్రలో చెలరేగిన హింసలో సుమారు వంద మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టు కొండ మీద ఉన్న మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలో స్వామివార్ల కళ్యాణం అనంతరం జైత్రయాత్ర నిర్వహించారు. స్వామి వార్ల కళ్యాణానికి ముందు నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపై నుంచి ఉత్సవ విగ్రహాలను భక్తులు పల్లకిలో జైత్రయాత్ర కోసం కిందకు తీసుకువచ్చారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో హింస చెలరేగింది. పోలీసులు ఆంక్షలు పెట్టినా ఉత్సవాల నిర్వహణకు వెనకాడలేదు.
Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !
చర్యలు చేపట్టినా ఆగని హింస
స్వామివారి ఉత్సవ మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వర్గం, అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. హింసను నిరోధించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అయినా ప్రతి ఏటాలానే వంద మందికి పైగా తలలు పగిలాయి. ఇప్పటికీ ఈ ఉత్సవంపై మానవ హక్కుల కమిషన్‌తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయి, కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. హింస జరుగుతుంటే పోలీసులు నియంత్రించలేక పోయారని నోటీసుల్లో ప్రశ్నించింది. ప్రభుత్వం, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా బన్ని ఉత్సవాల్లో హింస మాత్రం ఆగడంలేదు.
Also Read: రూ.100 కోసం వ్యక్తి హత్య.. కత్తితో ఛాతిలో పొడిచి దారుణం
గాయపడిన వారి సంఖ్య తక్కువే
గతేడాది కన్నా ఈ ఏడాది దేవరగట్టుకు భక్తులు భారీగా తరలివచ్చారని అయితే బన్నీ ఉత్సవంలో గాయపడిన వారి సంఖ్య తక్కువేనని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను దేవరగట్టులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నామని డీఎస్పీ స్పష్టం చేశారు.
Also Read: బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన పద్దతులు చెబుతున్న ఆయుర్వేదం