Kovur MLA Prasannakumar: నెల్లూరులో పెరిగిన పొలిటికల్ హీట్- వేమిరెడ్డి ఫ్యామిలీపై ప్రసన్నకుమార్ వ్యక్తిగత విమర్శలు
Andhra Politics: ప్రసన్న కుమార్ రెడ్డి తొలిసారిగా వేమిరెడ్డి దంపతుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రభాకర్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశారు.
MLA Prasanna Kumar Reddy: నెల్లూరులో పొలిటికల్ హీట్ పెరిగింది. నిన్న మొన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు నేడు శత్రువులుగా మారిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డిపై కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రశాంతి రెడ్డి తన రెండో భర్తను వెనకేసుకు రావద్దని అన్నారు ప్రసన్న. అదే సమయంలో వేమిరెడ్డికి కాంతం, కనకం, జూదం అంటే ఇష్టమని.. పర్సనల్ అటాక్ కి దిగారు. ప్రసన్న ప్రాతినిథ్యం వహిస్తున్న కోవూరులో ఈసారి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ అభ్యర్థి కావడంతో.. వేమిరెడ్డి దంపతులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరులో పూర్తిగా మారిన పొలిటికల్ ముఖ చిత్రం
నెల్లూరులో గత ఎన్నికలకు ఇప్పటికి పొలిటికల్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ 10కి 10 స్థానాలు సాధించి నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి అలాంటి పరిస్థితులు కనపడటం లేదు. పోరు హోరాహోరీగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ఆయనకు నెల్లూరు ఎంపీ స్థానం ఇచ్చిన టీడీపీ, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కోవూరు ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసే అవకాశమిచ్చింది. దీంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి గట్టి పోటీ ఎదురైనట్టయింది. వేమిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయనకు సన్నిహితంగా మెలిగేవారు. తన నియోజకవర్గంలో వీపీఆర్ ఫౌండేషన్ సాయంతో ఎన్నో కార్యక్రమాలు చేయించుకున్నారు. ఆ తర్వాత వేమిరెడ్డి పార్టీ మారినా కూడా ప్రసన్న పెద్దగా పట్టించుకోలేదు. తీరా వేమిరెడ్డి సతీమణికి టీడీపీ కోవూరు సీటు ఇవ్వడంతో ప్రసన్నలో ఆందోళన పెరిగింది. వేమిరెడ్డి రాకతో కోవూరు ఫలితం తారుమారయ్యే అవకాశముందని ఆయన కాస్త టెన్షన్ పడుతున్నారు. అందుకే వేమిరెడ్డిపై మాటల దాడి మొదలు పెట్టారు.
వేమిరెడ్డి ఫ్యామిలీపై వ్యక్తిగత విమర్శలు..
ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ వేమిరెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం సంచలనంగా మారింది. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతుల గురించి గతాన్ని ఎవరూ పెద్దగా బహిరంగ పరచిన దాఖలాలు లేవు. వేమిరెడ్డి కూడా ఎక్కడా పొలిటికల్ విమర్శలు కూడా చేయరు. అందుకే ఆయన కుటుంబ వ్యవహారాల జోలికి ఎవరూ వెళ్లరు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి తొలిసారిగా ఆయన్ను పర్సనల్ గా టార్గెట్ చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రభాకర్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంతి రెడ్డికి పోటీకి ఛాన్స్
నిన్న మొన్నటి వరకూ కోవూరులో టీడీపీ తరపున పోలంరెడ్డి దినేషన్ రెడ్డి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. ఆయన్ను పక్కనపెట్టి, పార్టీలోకి కొత్తగా వచ్చిన ప్రశాంతి రెడ్డికి చంద్రబాబు అవకాశమిచ్చారు. దీంతో ఇక్కడ టీడీపీలో కూడా రెండు వర్గాలయ్యాయి. అయితే వేమిరెడ్డి రాజకీయ చతురతతో దినేషన్ రెడ్డి కూడా ఈవైపే వచ్చారు. దీంతో గ్రామస్థాయిలో వైసీపీ నాయకులు చాలామంది టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. ఓ దశలో ప్రసన్న కుమార్ రెడ్డి సహనం కోల్పోయి గ్రామ సర్పంచ్ లు, ఇతర నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నేరుగా వేమిరెడ్డినే టార్గెట్ చేశారు.
వేమిరెడ్డి వర్సెస్ ప్రసన్న కుమార్ రెడ్డి
నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వేమిరెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటు కోవూరులో కూడా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోటీగా దూసుకెళ్తున్నారు. దీంతో కోవూరు రాజకీయం వేడెక్కింది. ఈసారి వైసీపీ గెలిస్తే.. ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. జిల్లాలో సీనియర్ నాయకుడిగా తనకు మంత్రి పదవి వస్తుందనేది ఆయన అంచనా. అదే సమయంలో ప్రశాంతి రెడ్డి వల్ల ఆ ఛాన్స్ మిస్ అవుతుందేమోననే ఆందోళన కూడా ఆయనలో ఉంది. అందుకే ప్రసన్న మరింత ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. పర్సనల్ అటాక్ కి దిగారు.