Kesineni Chinni: ఆంధ్రా క్రికెట్ సంఘం చీఫ్‌గా ఎంపీ కేశినేని చిన్ని - 6 పదవులు ఏకగ్రీవం
AP News: టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఆంధ్రా క్రికెట్ సంఘం చీఫ్‌గా ఎన్నికయ్యారు. దీన్ని వచ్చే నెల 8న అధికారికంగా ప్రకటించనున్నారు.
Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన అధ్యక్షుడిగా టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెల 8న విడుదల కానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులచేతుల్లోనే ఏసీఏ ఉండేది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరంతా తమ పదవులకు రాజీనామా చేశారు. విజయవాడలో ఈ నెల 4న జరిగిన సర్వసభ్య సమావేశంలో వీరి రాజీనామాలను ఆమోదించారు.
ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గం కోసం కసరత్తు ప్రారంభమైంది. అధ్యక్షుడితోపాటు అపెక్స్ కౌన్సిల్‌లోని ఆరు పదవులకు శుక్రవారం విశాఖ స్టేడియంలో నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్షుడిగా కేశినేని చిన్ని, ఉపాధ్యక్షుడిగా పి.వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీశ్‌బాబు, సంయుక్త కార్యదర్శిగా పి.విష్ణుకుమార్‌రాజు (విశాఖ నార్త్ ఎమ్మెల్యే), కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా డి. గౌరు విష్ణుతేజ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకెవరూ నామినేషన్లు వేయకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 8న ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ తర్వాతి రోజున అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారు.