AP High Court CJ: ఇవాళ ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రతో హైకోర్టు సీజేగా ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం జగన్, స్పీకర్, తదితరులు హాజరు అవుతారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఛత్తీస్‌గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వస్తున్నారు. జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా ఇప్పటికే విశాఖపట్నం నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు అధికారులు.
1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురుఘసిదాస్ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్‌బీ నుంచి పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాది వృతి చేపట్టారు. రాయగఢ్ జిల్లా కోర్టుతో పాటు , మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2009 డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఛత్తీస్‌గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. ఇప్పుడు పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర మూడో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం చేసిన సతీష్ చంద్ర శర్మ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఇటీవలే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్ చంద్ర పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రాష్ట్రపతి భవన్ నియమించిన సంగతి తెలిసిందే.
జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ భోపాల్‌లో 1961 నవంబర్ 30న జన్మించారు. వ్యవసాయరంగ నిపుణుడిగా పేరు పొందిన ఆయన తండ్రి బీఎన్ శర్మ భర్కతుల్లా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్‌గా, తల్లి శాంతిశర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. జబల్ పూర్‌లో ఇంటర్, సాగర్‌లోని హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలో బీఎస్సీ చేశారు. మూడు సబ్జెక్టుల్లో డిస్టింక్షన్ సాధించి, నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేయడంతోపాటు మూడు బంగారు పతకాలు గెలిచారు. 1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదుచేసుకొన్న ఆయన 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏండ్ల వయస్సులోనే ఆయన ఈ హోదా సాధించారు.
2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానెల్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2010 శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి 4న కర్ణాటక న్యాయమూర్తిగా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. గత ఆగస్టు 31నుంచి కర్ణాటక హైకోర్టులో తాత్కాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు.