CM Jagan: మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో జగనన్న పచ్చతోరణం - వన మహోత్సవం ప్రారంభం.. తొలి మెుక్క నాటనున్న సీఎం
ఇవాళ మంగళగిరి.. ఎయిమ్స్ ఆవరణలో మెుక్కనాటి జగనన్న పచ్చతోరణం-వన మహోత్సవం కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
పచ్చదనం పెంపునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎక్కడ చూసినా పచ్చదనం కళకళలాడాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే జగనన్న పచ్చతోరణం కింద మెుక్కలు నాటింది. మరో విడత జగనన్న పచ్చతోరణం-వన మహోత్సవం కింద.. మంగళగిరి ఎయిమ్స్ లో సీఎం జగన్ మెుక్కనాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
రెండు సంవత్సరాలలో 33.23 కోట్లు మెుక్కలు నాటామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈసారి కూడా అదే ఉత్సాహంతో మెుక్కలు నాటుతామన్నారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
విరివిగా మొక్కలు నాటే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రంలో సుమారుగా 75 లక్షల మొక్కలు నాటుతున్నామని తెలిపారు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపొందించడమే ప్రభుత్వానికి ముఖ్య ప్రాధాన్యత అన్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా స్కూళ్లు, ఆసుపత్రుల ఆవరణలో మొక్కలు నాటుతున్నామని వెల్లడించారు. 33 శాతం పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని గతంలోనే సీఎం జగన్ పిలుపునిచ్చారు. మొత్తం 20 కోట్ల మొక్కులు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఎక్కడ చూసినా మొక్కలు నాటడం మూలంగా వర్షాలతోపాటు ప్రకృతిపరంగా అనేక ప్రయోజనాలు ఒనగూరేందుకు అవకాశాలు ఉన్నాయి. మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణ ప్రయోజనంతోపాటు ప్రకృతి ద్వారా కూడా అనేక లాభాలు లభిస్తాయని భావిస్తూ అందరినీ భాగస్వాములను చేస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా డ్వామా, పంచాయతీ, అటవీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, జిల్లా పరిషత్‌ల ద్వారా సమన్వయం చేసుకుంటూ అధికారులు ముందుకు వెళ్లనున్నారు.
జగనన్న పచ్చతోరణంలో గ్రామాల్లో నాటే మొక్కల్లో 83 శాతం సంరక్షించకపోతే అందుకు సర్పంచులను బాధ్యులుగా చేసి అనర్హత వేటు వేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలోనే చెప్పారు. పంచాయతీరాజ్ చట్టంలో ఇప్పటికే సవరణలు చేశామని అప్పుడే తెలిపారు.
జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయతీరాజ్ రోడ్ల వెంబడి కూడా మొక్కలు నాటుతారు. రహదారుల వెంబడి నాటిన చింత, వేప, నేరేడు, ఏడాకుల పాయ, బాదం, రావి మొక్కలు చెట్లుగా మారితే రోడ్లకు పచ్చతోరణాలుగా మారతాయని అధికారులు చెబుతున్నారు. ‘జగనన్న పచ్చతోరణం’ కింద ఈ ఏడాది గ్రామాల్లో 1.02 కోట్ల మొక్కలు నాటాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు చేస్తోంది.
Also Read: CM Jagan: నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష.. అంగన్ వాడీ టీచర్లకు గుడ్ న్యూస్