Andhra Pradesh: విపత్తు నిర్వహణకు స్పేస్ టెక్నాలజీ సాయం, సీఎం చంద్రబాబు సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ ఒప్పందం
AP Disaster management | విపత్తు నిర్వహణకు స్పేస్ టెక్నాలజీ సాయం తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఇస్రో- ఆర్టీజీఎస్ ఒప్పందం చేసుకుంది.

Andhra Pradesh News : ఏపీలో ప్రజల భద్రతకు మరింత దోహదంప్రభుత్వ పాలనలో స్పేస్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగువేసింది. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సమక్షంలో ఇస్రో-ఆర్టీజీఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల పాటు సాగే ఈ ఒప్పందం ద్వారా శాటిలైట్ చిత్రాలు, శాస్త్రీయ సమాచారంతో AWARE ప్లాట్‌ఫామ్‌ను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. ఇది వ్యవసాయం, వాతావరణం, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక తదితర విభాగాల్లో 42కి పైగా అప్లికేషన్లలో పనిచేయనుంది. ఆధునిక సాంకేతికతలను సమన్వయం చేసి... విపత్తుల నిర్వహణలో మెరుగైన ఫలితాలు అందించి ప్రజల భద్రతకు దోహదపడుతుంది.
AWARE ప్లాట్‌ఫామ్ శాటిలైట్‌లు, డ్రోన్లు, IoT పరికరాలు, సెన్సార్లు, మొబైల్ ఫోన్ల ఫీడ్, సీసీటీవీ వంటి వనరుల నుంచి డేటాను సమగ్రంగా సేకరించి ప్రజలకు SMS, WhatsApp రూపంలో తక్షణ హెచ్చరికలు, సూచనలు చేస్తుంది. ఈ ఒప్పంద ద్వారా ముఖ్యంగా విపత్తు నిర్వహణలో ప్రజలకు అత్యంత ఖచ్చితమైన సమాచారం త్వరితగతిన చేరవేసే అవకాశం లభిస్తుంది. ఇస్రో డైరెక్టర్ రాజరాజన్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ మధ్య జరిగిన కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.





















