Adani Meets CM Jagan : సీఎం జగన్ తో అదానీ భేటీ - అధికారిక పర్యటన కాదంటున్న ప్రభుత్వ వర్గాలు !
ఏపీ సీఎం జగన్‌తో గౌతం అదానీ సమావేశం అయ్యారు. అయితే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
Adani Meets CM Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతం అదానీ కలిశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన నేరుగా తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. గతంలోనూ పలుమార్లు గౌతం అదానీ తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. అయితే ఎప్పుడూ అధికారికంగా భేటీల గురించి సీఎంవో కానీ.. సీఎం క్యాంప్ ఆఫీసు వర్గాలు కానీ ప్రకటన చేయలేదు. ఓ సారి తన కుటుంబంలో శుభకార్యానికి ఆహ్వానించేందుకు వచ్చారని అనధికారికంగా చెప్పారు. ఇప్పుడు అలాంటి ఆహ్వానం కోసం వచ్చి ఉంటారని అంటున్నారు.
మామూలుగా అయితే దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఎవరైనా సీఎం జగన్ ను కలిసేందుకు వస్తే ప్రత్యేకంగా మీడియాకు తెలియచేస్తారు. ఏ పని మీద వచ్చారో చెబుతారు. పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు ఉంటే వాటి గురించి కూడా వివరిస్తారు. తర్వాత ఫోటోలు, వీడియోలు పీఆర్వోల ద్వారా మీడియాకు ఇస్తారు. కానీ గౌతం అదానీ భేటీల విషయంలో ఎప్పుడూ సమాచారం ఇవ్వలేదు. అందుకే వ్యక్తిగత పర్యటనగా భావిస్తున్నారు.
మరో వైపు ఏపీలో అదానీ గ్రూపు ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. గంగవరం, కృష్ణపట్నంపోర్టులను కొనుగోలు చేసింది. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను కూడా అదానీ గ్రూపునకు ప్రభుత్వం అమ్మేసింది. అలాగే సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ శ్రీసత్యసాయి జిల్లాలోని చిత్రావతి, వైఎస్‌ఆర్ జిల్లాలోని గండికోట, పార్వతీపురం మన్యం జిల్లా కురుకుట్టి, కర్రివలసలలో 3,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల (పీఎస్‌పీ) ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా రూ.15,376 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 4 వేల మందికి ఉపాధి కలుగుతుంది.
విశాఖలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో గౌతం అదానీ కుమారుడు పాల్గొని భారీ పెట్టుబడులను ప్రకటించారు. ఏడాదికి 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కడప, నడికుడిలో రెండు సిమెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో 400 మెగా వాట్ల డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఇటీవలే శంకుస్థాపన కూడా చేశారు. ఏపీలో ప్రతి ఇంటికి త్వరలో స్మార్ట్ మీటర్లు పెట్టనున్నారు. రాష్ట్రంలోని సుమారు 1.96 కోట్ల విద్యుత్ కనెక్షన్లకు దశల వారీగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదటి దశలో 27 లక్షల కనెక్షన్లకు, రెండో దశలో మరో 25 లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. తొలి దశ మీటర్ల ఏర్పాటుకు గత డిసెంబరులో టెండర్లు పిలిచాయి. మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే.. అదానీ ఎల్1గా నిలిచింది. దీంతో టెండర్ ఆ సంస్థకే దక్కింది.
ఇలా ఏపీలో పలు ప్రాజెక్టులతో అదానీ సంస్థ కీలకంగా ఉంది. ఇలాంటి సమయంలో సీఎం జగన్ ను అదానీ కలవడం ఆసక్తికరంగా మారింది.