Ganta Srinivas : సెంటిమెంట్ బ్రేక్ చేసిన గంటా శ్రీనివాస్ - మరి విజయం లభిస్తుందా ?
Andhra : గంటా శ్రీనివాసరావు తొలి సారి ఓ నియోజకవర్గంలో రెండో సారి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రతి ఎన్నిక సమయంలో నియోజకవర్గం మార్చుకుంటూ వస్తున్నారు.
Ganta Srinivasa Rao From Bhimili : గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క సారి కూడా ఓడిపోలేదు. అలాగని ఆయన రెండో సారి తాను గెలిచిన నియోజకవర్గంలో పోటీ చేయలేదు. తొలి సారి సెంటిమెంట్ బ్రేక్ చేశారు. గతంలో గెలిచిన భీమిలీ నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ఒక సారి పోటీ చేసిన చోట మరోసారి పోటీ చేయని గంటా
ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా దాదాపు రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేత గంటా శ్రీనివాసరావు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి తొలిత అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2004 లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లోనే ప్రజారాజ్యం పార్టీ రావడంతో ఆ పార్టీలో చేరారు. 2009లో పీఆర్‌పీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. ఇక్కడ ఆయనకు మరో అంశం కలిసొచ్చింది. పీఆర్‌పీ.. కాంగ్రెస్‌లో విలీనం కావడంతో పీఆర్‌పీ కోటాలో రాష్ట్ర మంత్రి అయిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోవడంతో గంటా తిరిగి సొంత గూటికి చేరారు. టీడీపీ తరఫున భీమిలి టికెట్ సాధించి 2014లో మళ్లీ ఎమ్మెల్యే అయిపోయారు. అంతే కాకుండా చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించారు. తిరిగి 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలో లేనందున ఎమ్మెల్యే గానే ఉండిపోయారు.
ఈ సారి కూడా కొత్త నియోజకవర్గంలో పోటీ చేసే చాన్స్ - కానీ భిమీలికే ఓటు
ఈ సారి ఆయన గత ఎన్నికల్లో గెలిచిన విశాఖ నార్త్ నుంచి పోటీ చేయదల్చుకోలేదు. మరో నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. అయన కోరిక తీర్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని సూచించారు. కానీ గంటా మాత్రం.. సెంటిమెంట్ బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యారు. భీమిలీ కాాలని పట్టుబట్టారు. అదే నియోజకవర్గం ఖరారైంది. సెంటిమెంట్‌కు విరుద్ధంగా గంటా శ్రీనివాస్ ఈసారి పోటీకి దిగారు. పోటీ చేసిన నియోజకవర్గంలో తిరిగి పోటీ చేయని గంటా శ్రీనివాసరావు గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన భీమిలి నియోజకవర్గంలోనే రెండోసారి పోటీ చేస్తున్నారు. ఎన్నికల మేనేజ్మెంట్‌లో చాణక్యుడైన గంటా శ్రీనివాస్ రెండోసారి నెగ్గుకోస్తారా.... అన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
భీమిలీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని గంటా భావన
గంటా శ్రీనివాసరావు భీమిలీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అక్కడ మంచి ఫలితాలు సాధించింది. గట్టి క్యాడర్ ఉంది. గంటా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వారు లేరు. అదే సమయంలో జనసేన తో పొత్తు కలసి వస్తుంది. టీడీపీ, జనసేన కలిస్తే భీమిలీలో ఏకపక్ష ఎన్నిక జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఈ సారి సెంటిమెంట్ బ్రేక్ చేసినా గెలుపు దగ్గరకే వెళ్తానని గంటా గట్టి నమ్మకంతో ఉన్నారు.