Kurnool Diamonds: కర్నూలు జిల్లాలో వరుసగా వజ్రాలు లభ్యం - ధర ఎంతంటే?
Andhra Pradesh News: కర్నూలు జిల్లాలో ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. ఓ వజ్రాన్ని రూ.6 లక్షలు, 6 తులాల బంగారం ఇచ్చి వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Diamonds Found In Kurnool District: కర్నూలు జిల్లాలో వరుసగా వజ్రాలు లభ్యమవుతున్నాయి. జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. వీటిని వేలం వేయగా ఓ వజ్రానికి రూ.6 లక్షలు, 6 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరో వజ్రాన్ని ఇంకా వేలం వేయలేదు. దీని విలువ రూ.12 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వారం రోజుల్లోనే దాదాపు 10 వజ్రాలను ఎవరికీ తెలియకుండా కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా, వర్షాకాలంలో స్థానికులు వజ్రాల కోసం పెద్ద ఎత్తున పొలాల్లో వేట సాగిస్తుంటారు. జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెరా, పగిడిరాయ్, పెరావళి, మహానంది, మహాదేవపురం ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతుంటారు. వర్షాకాలం ప్రారంభమైన జూన్ నుంచి నవంబర్ వరకూ ఈ వేట కొనసాగుతుంది.
రైతు పొలంలో..
అటు, శనివారం మదనంతపురంలో ఓ రైతు పొలంలో విలువైన వజ్రం బయటపడింది. రైతు దాన్ని ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచారు. వజ్రాన్ని పరీక్షించే లోపే వ్యాపారులు సదరు రైతు ఇంటి ముందు క్యూ కట్టారు. వజ్రాన్ని రూ.18 లక్షల నగదు, 10 తులాల బంగారం ఇచ్చి దాన్ని కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్‌లో దీని ధర రూ.30 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్థులు పొలాల్లోకి వజ్రాల వేట కోసం పరుగులు తీశారు. అలాగే, మద్దికెర మండలం హంప గ్రామస్థునికి ఓ వజ్రం దొరికింది. దీన్ని పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు సమాచారం. రూ.5 లక్షలతో నగదుతో పాటు 2 తులాల బంగారం ఇచ్చి వజ్రాన్ని సదరు వ్యాపారి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, వర్షాకాలంలో వజ్రాల కోసం స్థానిక పొలాల్లో స్థానిక గ్రామస్థులు సహా ఇతర ప్రాంతాల నుంచి సైతం భారీగా తరలివచ్చి వెతుకుతుంటారు. పొలాల్లో దొరికిన వజ్రాలను రహస్యంగా వ్యాపారులకు అమ్మేస్తుంటారు. వ్యాపారులు కూడా ఆ ప్రాంతాలకు స్థానికంగానే మకాం వేస్తారు. వజ్రాలకు పోటీ ఎక్కువైన సందర్భంలో వేలం వేస్తారు. ఆ వేలంపాటలో బంగారం, డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తుంటారు. కర్నూలు జిల్లా వాసులే కాకుండా.. అనంతపురం, కడప, ప్రకాశం, బళ్లారి ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ వజ్రాల కోసం వెతుకుతుంటారు.
Also Read: Ap Elections 2024: పోలీస్ బందోబస్తుతో వెళ్లి ఓటేసిన కుటుంబం - ఆలస్యంగా వెలుగులోకి, ఎందుకో తెలుసా?