Nara Lokesh Chitchat: వీఎస్ఆర్ వెంచర్స్‌తో సంబంధాలపై లోకేష్ కీలక వ్యాఖ్యలు-తేల్చేశారా?
Nara Lokesh : వీఎస్ఆర్ వెంచర్స్ విమానయాన సంస్థతో హెరిటేజ్ కు ఉన్నసంబంధాలపై వస్తున్న ఆరోపణల్నిలోకేష్ తోసి పుచ్చారు. 2022లో ఆ కంపెనీకి రుణం ఇవ్వడం తప్ప ఏ సంబంధం లేదన్నారు.

Nara Lokesh On Vsr Ventures: ఏపీ అసెంబ్లీ లాబీల్లో మంత్రి నారా లోకేష్ మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలుచేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానికి కారణం అయిన విమానం యజమాని వీఎస్ఆర్ ఏవియేషన్స్‌తో హెరిటేజ్ సంస్థకు సంబంధాలు ఉన్నాయన్న విపక్షాల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. హెరిటేజ్ సంస్థకు వీఎస్ఆర్ ఏవియేషన్స్‌తో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని, ఆ సంస్థతో కలిసి ఒక కప్పు కాఫీ కూడా తాగలేదని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం 2022లో ఆ సంస్థ తమ వద్ద ఫైనాన్స్ తీసుకుందని, ఆ సమయంలో తాము అధికారంలోకి వస్తామని గానీ, తమ ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని గానీ ఊహించడానికి తామేమీ జ్యోతిష్యులం కాదని లోకేష్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
జగన్ ను అరెస్టు చేయాలని బొత్స చెబుతున్నారా?
లిక్కర్ స్కాం విషయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన చిల్లర దొంగలను పట్టుకుని గజదొంగలను వదిలేస్తున్నారు అన్న వ్యాఖ్యలకు లోకేష్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. బొత్స ఉద్దేశించిన ఆ గజదొంగ జగన్ మోహన్ రెడ్డేనా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ను పట్టుకోవాలని బొత్స కోరుకుంటున్నారా అని నిలదీశారు. మద్యం స్కాంలో సిట్ విచారణలో తేలింది కూడా అదేనని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమపై స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి అనేక తప్పుడు కేసులు పెట్టారని, కానీ గవర్నర్ లేదా స్పీకర్ వంటి కాంపిటెంట్ అథారిటీలకు ఒక్క ఆధారమైనా చూపించగలిగారా అని ఆయన సవాల్ విసిరారు.
ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ క్లాసులు
శాసనసభ్యుల పనితీరును మెరుగుపరిచేందుకు కొత్తగా ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఒక యూనివర్సిటీ తరహాలో అభివర్ణిస్తూ, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రిన్సిపాల్ అని, తామంతా స్టూడెంట్స్' అని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ రెసిడెన్షియల్ క్లాసుల్లో ఎమ్మెల్యేలందరూ పాల్గొంటారని, తాను కూడా వారి పక్కనే కూర్చుని పాఠాలు వింటానని చెప్పారు. ప్రజాప్రతినిధులు సభలో ఎలా వ్యవహరించాలి, పాలనలో మెళకువలు వంటి అంశాలపై ఇక్కడ శిక్షణ ఉంటుందని వివరించారు.
రాజకీయాలకు సంబంధం లేని ఆత్మీయ సమావేశాలు
ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించే సమావేశాల గురించి ప్రస్తావిస్తూ, ఇవి కేవలం రాజకీయాల కోసం కాదని, ఒక కుటుంబం అనే కాన్సెప్ట్‌తో జరుగుతున్నాయని లోకేష్ స్పష్టం చేశారు. ఈ ఆత్మీయ భేటీల్లో రాజకీయ చర్చలకు తావుండదని, కేవలం ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయతను పంచుకోవడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా తాము అడుగులు వేస్తున్నామని లోకేష్ తెలిపారు.























