Rains In AP and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో 3 రోజులపాటు వర్షాలు
Rains in AP and Telangana | బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, యానాంలో రెండు నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.
Andhra Pradesh Weather Update | అమరావతి/ హైదరాబాద్: ఇటీవల ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలో ఐదు నుంచి ఏడు రోజులపాటు వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మూడు రోజులపాటు ఏపీ, తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని, అన్నదాతలు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
భూమధ్య రేఖ ప్రాంత హిందూ మహాసముద్రంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల అవర్తనం విస్తరించి ఉంది. దాని ప్రభావంతో నేడు దక్షిణ బంగాళాఖాతంలోని అల్పపీడనం ఏర్పడిందని అధికారులు అంచనా వేశారు. ఇది క్రమంగా పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా డిసెంబర్ 12 నాటికి శ్రీలంక- తమిళనాడు తీరాల వద్ద మరింత బలపడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశ, తూర్పు దిశగా గాలులు వీచనున్నాయి.
డిసెంబర్ 07, శనివారం :
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) December 6, 2024
· శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
~ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ pic.twitter.com/7YdcCMv9Vb
అల్పపీడనంతో ఏపీలో వర్షాలు
ఫెంగల్ తుపాను తరువాత ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. తాజా అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఆకాశం ఇప్పటికే మేఘావృతమై ఉండగా కొన్నిచోట్ల వర్షం కురుస్తోంది. నేడు శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మరో రెండు రోజులపాటు కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలో వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ప్రొఫెసర్ జయశంకర్ భూపాళపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట, నల్గొండ జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. మిగతా అన్ని జిల్లాల్లోనూ కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురవనుందని అధికారులు తెలిపారు.
Rainfall Spatial distribution forecast of Telangana for next 5 days dated 07.12.2024 pic.twitter.com/UcrIHDMTXW
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) December 7, 2024
ఆదివారం, సోమవారం వర్షాలు
తెలంగాణలో ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగామ, ములుగు, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల డిసెంబర్ 8న తేలికపాటి వర్షం పడనుంది. సోమవారం నాడు జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలిక వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మిగతా చోట్ల వాతావరణం పొడిగా ఉంటుందని, కానీ చలి గాలుల తీవ్రత పెరగుతుందని పేర్కొన్నారు.