Vizag Capital Row : "ఏపీ రాజధాని"తో కేంద్రం చెలగాటం..! ప్రతీసారి ఈ వివాదమెందుకు ?
ఏపీ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం గుర్తించిందని ఆదివారం ప్రచారం జరిగింది. పొద్దుపోయిన తర్వాత కేంద్రం "తూచ్" అనేసింది. తప్పు జరిగిందని చెప్పింది. సున్నితమైన అంశంపై కేంద్రం ఎందుకిలా ఆటలు ఆడుతోంది ?
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం ప్రకటించిదంటూ ఆదివారం ఒక్క సారిగా రాజకీయ కలకలం ప్రారంభమయంది. దీనికి కారణం జూలై 26వ తేదీన లోక్‌సభలో కేంద్రం ఇచ్చిన ఓ లిఖిత పూర్వక సమాధానం. ఆ సమాధానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్ అని పేర్కొన్నట్లుగా బయటకు రావడంతో ఏపీ రాజకీయ పార్టీల్లో ఒక్క సారిగా కదలిక వచ్చింది. వాదోపవాదాలు జరిగాయి. అయితే కొన్ని గంటల్లోనే కేంద్రం క్లారిటీ ఇచ్చింది. " క్లిరికల్ " మిస్టేక్ జరిగిందని వైజాగ్ రాజధాని కాదని ప్రధాన నగరం మాత్రమేనని పేర్కొంది. దీంతో వివాదం సద్దుమణిగింది కానీ కేంద్రం ఎందుకు ఇలా ఏపీ రాజధానితో ఆడుకుంటుందనే సందేహాలు ప్రజల్లో ప్రారంభమయ్యాయి. దీనికి కారణం ఇలా జరగడం ఇదే మొదటి సారి కాదు.
ఈ సారి రాజధాని మంట పెట్టిన "పెట్రో" శాఖ..!
జూలైలో పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. జూలై 26వ తేదీన కేంద్రానికి లోక్‌సభలో ఓ ఎంపీ రాష్ట్రాలపై పెట్రో ధరల పెంపు ప్రభావం ఎలా ఉందని ప్రశ్నించారు. దీనికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఆ సమాధానంలో అన్ని రాష్ట్రాల పెట్రోల్ రేట్లు గత ఏడాది.. ఈ ఏడాది పోల్చి చూశారు. ఎంతెంత పెరిగాయి.. లేదా ఎంతెంత తగ్గాయో వివరించారు. అనెక్సర్‌లో ఇచ్చిన పత్రంలో రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న రేట్లు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేపిటల్ అనే చోట వైజాగ్ అనే పేరు చేర్చారు. ఆ విషయం ఇప్పుడు వైరల్ అయింది. ఏపీ రాజధానిగా విశాఖను కేంద్రం అంగీకరించేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేయడం ప్రారంభించారు.
తప్పు జరిగిందని రాత్రికి క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
వైజాగ్‌ను కేంద్రం రాజధానిగి డిక్లేర్ చేసిందన్న ప్రచారం ఏపీలో జరగడంతో కేంద్రం ఆదివారం అయినా స్పందించింది. వైజాగ్ ఏపీ రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని తెలిపింది.విశాఖ ఏపీ రాజధాని కాదని, అది ఒక నగరం మాత్రమేనని వెల్లడించింది. పెట్రోలియం ట్యాక్స్‌కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని పేర్కొంది. హెడ్డింగ్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్రం తెలిపింది. హెడ్డింగ్‌లో క్యాపిటల్‌తో పాటు సమాచారం సేకరించిన నగరం పేరును ఇప్పుడు చేర్చుతున్నామని ప్రకటించింది. లోక్‌సభ సచివాలయానికి కూడా సమాచారం ఇచ్చామని, ప్రధాన నగరాలలో పెట్రోల్ ధరల ప్రభావాన్ని అంచనా వేశామని తెలిపింది. హర్యానాలో అంబాలా, పంజాబ్‌లో జలంధర్ నగరాలను తీసుకున్నామని ఆ నగరాలు ఆ రాఫ్ట్రాల రాజధానులు కావని కేంద్రం స్పష్టం చేసింది.
హర్యానా, పంజాబ్ పార్టీలు అసలు పట్టించుకోలేదు..!
కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిన డాక్యుమెంట్‌లో హర్యానా రాజధాని అంబాలా అని ఉంది. పంజాబ్ రాజధాని జలంధర్ అని ఉంది. వాస్తవానికి ఆ రెండు రాష్ట్రాల రాజధానులు అవి కావు. పంజాబ్‌కు కలిసి ఉమ్మడి రాజధానిగా చండీఘడ్ ఉంది. పెట్రో ధరలపై కేంద్రం ఇచ్చిన సమాచారంలో తమ రాష్ట్రాల రాజధానులను కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిందని అక్కడి రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టలేదు. ఎందుకంటే పెట్రోలియం మంత్రిత్వ శాఖలో ఏదో క్లరికల్ మిస్టేక్ జరిగినంత మాత్రాన రాష్ట్రాల రాజధానులు మారిపోతాయా అని వారి డౌట్. కానీ ఏపీలో మాత్రం ఎవరి వాదనతో వారు తెరపైకి రావడంతోనే రాజకీయం అయిపోయింది.
కోర్టులో ఉన్నా కేంద్ర శాఖలు ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నాయి..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అంటూ నెల రోజుల కిందట సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి ప్రశ్నిస్తే విశాఖపట్నమే రాజధాని అని సమాధానం ఇచ్చారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో విషయం కోర్టులో ఉందని. పొరపాటు పడ్డామని సరిదిద్దుకున్నారు. నిజానికి అది పొరపాటు కాదు. కేంద్రంలోని శాఖలు ఏపీ పరిస్థితితో ఆటలు ఆడుకుంటున్నాయన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే నిన్నామొన్నటి వరకూ ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ అమరావతి అనే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం... అమరావతి ఏపీ పాలనా కేంద్రం అని చెప్పడానికి సిద్ధపడటం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఉత్తర ప్రత్యుత్తరాలపై అడ్రస్ హెచ్ బ్లాక్ లాక్, ఏపీ సెక్రటేరియట్. హైదరాబాద్ అని ఉంటోంది. కేంద్ర ఆర్థిక శాఖ రుణపరిమితి విషయంలో పంపిన లేఖలపై అలాగే ఉంది. ఇప్పుడు హైదరారాబాద్ సెక్రటేరియట్‌లో హెచ్ బ్లాక్ లేదు. హెచ్ బ్లాక్ కాదు అసలు ఏ బ్లాక్ లేదు. వాటిని కూలగొట్టేసి..కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభించారు.
ఇప్పటికీ అధికారిక రాజధాని అమరావతినే...!
ఏపీ రాజధానిని అమరావతిగా కేంద్రం గుర్తించింది. పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. కేంద్రం మ్యాప్‌లోనూ పెట్టించింది. గెజిట్‌లో అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయాన్ని, అక్కడ నిర్మాణాలకు స్వయంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అంశాన్ని, రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రానికి కొంత మేర నిధులిచ్చిన విషయాన్ని కూడా కేంద్రం.. కేంద్రంలోని శాఖలు మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తూండటం ప్రజల్ని సైతం విస్మయ పరుస్తోంది. సెక్రటేరియట్ అమరావతిలో ఉందని.. పరిపాలన అక్కడ్నుంచే సాగుతోందని.. కేంద్రం మర్చిపోయింది. ప్రస్తుతం రాజధాని అంశం కోర్టులో ఉంది. కోర్టులో తేలిన తర్వాతనే ఏదైనా అధికారికం. అప్పటి వరకూ అమరావతినే రాజధాని . కానీ కేంద్రం దీన్ని పట్టించుకోకుండా ఏపీతో .. ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటూనే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.