CM Jagan Bail Cancellation Petition: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. మరోసారి వాయిదా
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ మరింత సమయం కోరడంతో విచారణను వాయిదా వేశారు.
అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖిత పూర్వక వాదనలు వినిపించేందుకు సీబీఐ కోర్టు మరింత సమయం కోరడంతో ఈ నెల 30కి విచారణ వాయిదా పడింది. ఎంపీ రఘురామ, జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు.
చట్ట ప్రకారం పిటిషన్‌లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ గతంలో కోర్టుకు తెలిపింది. తాము సైతం లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని.. పది రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14న కోర్టును సీబీఐ కోరింది. అంగీకరించిన సీబీఐ కోర్టు నేటికి వాయిదా వేసింది. ఇవాళ కూడా మరోసారి సీబీఐ సమయం కోరడంతో విచారణ 30కి వాయిదా వేశారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీఎం జగన్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న విషయం తెలిసిందే. అయితే జగన్ బెయిల్ కండీషన్స్ ఉల్లంఘించారంటూ గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. రిజాయిండర్ కూడా వేశారు. తన కేసుల్లో తనతో పాటు నిందితులుగా ఉన్నవారికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ లబ్ది చేకూరుస్తున్నారని పిటిషన్ లో తెలిపారు. సాక్ష్యులను బెదిరించేందుకు, ప్రభావితం చేసేందుకు పలు మార్గాల్లో ప్రయత్నించారని రఘురామ అన్నారు.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా పడిన తర్వాత పిటిషనరైన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ స్పందించారు. ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు సీబీఐ వాళ్లు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారి తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నుంచి మాత్రం సరైన మద్దతు లభించనట్లుగా పరిస్థితి ఉందన్నారు. విక్రమార్కుడు-బేతాళుడు కథలా, ప్రతిసారీ కేసు వాయిదా పడటం, మళ్లీ సీబీఐ లాయర్లు టైమ్ కోరడం పరిపాటిగా మారిందని, కనీసం లాయర్లను మార్చుకునే దిశగా సీబీఐ ఆలోచన చేయాలని రఘురామ అన్నారు.
తనను విదేశాలకు వెళ్లకుండా చూడాలంటున్నారని.. 20 కేసులున్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లొచ్చా? అని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. దిల్లీలో మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడారు. ఏ-1 చేపట్టిన పనులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఏ-2 స్థాపించిన సూట్ కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరిగాయని ఆరోపించారు. క్విడ్‌ప్రోకో, సూట్ కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో వివరించినట్లు రఘురామ తెలిపారు. జగన్, విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు రఘురామ పేర్కొన్నారు.