Chandrababu News: ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు - ఒకరోజు ఉండే అవకాశం
Chandrababu News: టీడీపీ అధినేత చంద్రబాబు వైద్యుల సూచన మేరకు ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఒకరోజు ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల అనంతరం ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఒకరోజు ఆస్పత్రిలో ఉండే అవకాశం ఉంది. స్కిల్ కేసులో 52 రోజులు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో బుధవారం సాయంత్రం చంద్రబాబును పరీక్షించిన ఏఐజీ వైద్యుల బృందం ఆయన తెలిపిన సమస్యల ప్రకారం గురువారం ఆస్పత్రికి రావాల్సిందిగా సూచించారు. వారి సలహా మేరకు ఉదయం ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన వైద్యులు అడ్మిట్ కావాలని సూచించడంతో చంద్రబాబు ఆస్పత్రిలో చేరారు.
చంద్రబాబు ర్యాలీపై కేసు
అంతకు ముందు, హైదరాబాద్ లో చంద్రబాబు ర్యాలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించారని, అనుమతి లేకుండా ర్యాలీ చేశారని బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 341, 290, 21 రెడ్ విత్ 76 సీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ర్యాలీ ద్వారా 2 గంటల పాటు రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిబంధనలు పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాదా సిటీ టీడీపీ జనరల్ సెక్రటరీ జీవీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. సుమారు 400 మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
బుధవారం బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోగానే పార్టీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి టీడీపీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లారు. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ర్యాలీ చేశారని పోలీసులు తెలిపారు. 2 గంటలు రోడ్లపై అలా వెళ్లడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని వెల్లడించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేశారు.
ఏపీ సీఐడీ మరో కేసు
అటు, స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పొందినా, చంద్రబాబుపై సీఐడీ కేసుల పరంపర కొనసాగుతోంది. మొన్న మద్యం విధానంలో కేసు నమోదు చేయగా తాజాగా, ఇసుక విషయంలో ప్రభుత్వానికి నష్టం కలిగించారంటూ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు చర్యలు చేపట్టారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని, ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే అప్పటి ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించిందని సీఐడీ తెలిపింది.
మద్యం విధానంలోనూ
చంద్రబాబు హయాంలో మద్యం విధానంలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ 2 రోజుల క్రితం సీఐడీ కేసు నమోదు చేసింది. టీడీపీ హయాంలో మద్యం బ్రాండ్లకు అక్రమంగా అనుమతి ఇచ్చారని ఆరోపించింది. చంద్రబాబు హయాంలో పలు మద్యం కంపెనీలకు, సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని వారికి అనుచిత లబ్ధి కలిగించారని ఆరోపిస్తూ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలపై సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.
కాగా, చంద్రబాబుపై ఇప్పటివరకూ 6 కేసులు నమోదయ్యాయి. స్కిల్ స్కాం కేసు సహా పలు ఆరోపణలు చేస్తూ సీఐడీ కేసులు నమోదు చేయగా విచారణలో ఉన్నాయి. వీటిపై చంద్రబాబు న్యాయస్థానాల్లో సవాల్ చేశారు. తనపై కేసులన్నీ అక్రమం అని తనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో తీర్పు రావాల్సి ఉంది. ఈ లోపే ఆయనపై 2 రోజులకో కేసు నమోదు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
Also Read: సీఎం జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం - గవర్నర్ జోక్యం చేసుకోవాలన్న లోకేష్