Chandra Babu Naidu: సీఎం జగన్ కు సున్నా మార్కులే - చంద్రబాబు
Chandra Babu Naidu: పోలవరం ముంపు ప్రాంతాలను ప్రజలను సీఎం జగన్ గోదాట్లో ముంచేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఆయనకు సున్నా మార్కులే వేస్తున్నానన్నారు.
![Chandra Babu Naidu: సీఎం జగన్ కు సున్నా మార్కులే - చంద్రబాబు Chandrababu Fire o YSRCP Government Over Flood Relief Chandra Babu Naidu: సీఎం జగన్ కు సున్నా మార్కులే - చంద్రబాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/29/617ba56496fc42bb7da453ab0bf27af01659075259_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandra Babu Naidu: ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో.. తెలుగు దేశం అధినేత చంద్రబాబు పర్యటించారు. మేడేపల్లి నుంచి వాహనాలతో ర్యాలీగా వేలేరుపాడు మండలం చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను, గృహాలను చంద్రబాబు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివ కాశీపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం దగ్గర అమరావతి రాజధాని రైతులు.. వెయ్యి మంది బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్కక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు.
బారికేడ్లు, పరదాల చాటున పర్యటనలు..
కొందరు బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. శివకాశీపురంలో బాధితులు.. పరిహారం, పునరావాసం, వరదల సాయంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబుకు ఏకరువు పెట్టారు. మూడేళ్లుగా ప్రజల కష్టాలు పట్టని ముఖ్యమంత్రి ఇప్పుడు బారికేడ్లు, పరదాల చాటున పర్యటనలు చేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆకాశంలో తిరిగితే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. కొన్ని కూరగాయలు, ఓ రెండు వేలు చేతిలో పెడితే ప్రజల కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతారని నిలదీశారు.
పోలవరంపై చేతులెత్తేశారు..
హుద్ హుద్ విపత్తు సమయంలో తెలుగు దేశం హయాంలో ఇచ్చిన జీవోను మెరుగుపరిచి మరింత ఉదారంగా సాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంటూర్ లెవల్ తగ్గించి సీఎం జగన్ కొత్త కుట్రకు తెరలేపారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరంపై కేంద్రంతో పోరాడాల్సింది పోయి చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీలందరూ రాజీనామా చేసి.. డిమాండ్ చేస్తే పోలవరం ఎందుకు పూర్తి కాదని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం ముందు ప్రాంతాలన్నింటిని కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని పునరుద్ధాటించారు. పోలవరం కోసం త్యాగం చేసిన వారికి సాయం చేస్తానని వివరించారు.
పది లక్షలకు బదులుగా పదివేలే ఇస్తామంటున్నారు..
అయితే పోలవరం బాధితులకు పది లక్షల రూపాయల నష్ట పరిహారం ఇస్తానని చెప్పి.. ఇప్పుడు పది వేలే ఇస్తామంటున్నారని ఆ బాధితురాలు వాపోయింది. గతంలో మీరు 5 వేలు ఇచ్చి జాబితా సిద్ధం చేశారని... ఆ జాబితా బయటకు తీసి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలని చెప్పింది. ఉడికీ ఉడకని అన్నం పెడ్తున్నారని వివరించింది. తన భర్త చనిపోయాడని, వరదల్లో ఇళ్లు కూడా కొట్టుకుపోయిందంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. అలాగే తనకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని.. వాళ్ల పెళ్లి ఎలా చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వరదలు వచ్చిన పదిహేను రోజులు దాటిని బాధితులకు న్యాయం చేయలేని చేతకాని ప్రభుత్వం ఇదంటూ మండిపడ్డారు. సీఎం జగన్ కు సున్నా మార్కులే వేస్తున్నాని తెలిపారు.
ఈ మధ్య పోలవరం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్... కేంద్రం నుంచి నిధులు వచ్చిన వెంటనే న్యాయం చేస్తామన్నారు. ఒకటో రెండు వేలో అయితే తాము భరించగలమని.. ఇరవై వేల కోట్లు కాబట్టి భరించే శక్తి రాష్ట్రానికి లేదన్నారు జగన్. కాంటూరు విషయంలో కూడా కీలక కామెంట్స్ చేశారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహవ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)