Flood Relief: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం - రూ.3,300 కోట్లు విడుదల, వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్
AP Telangana: వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఏపీ, తెలంగాణకు తక్షణ సాయం కింద రూ.3,300 కోట్లు విడుదల చేసింది.
Central Assistance To AP And Telangana: భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఇరు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వరదల్లో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో (Sivaraj Singh Chauhan) పాటు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. అటు, తెలంగాణ సెక్రటేరియట్‌లో వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి పరిశీలించారు. కాగా, ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) నగరం గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర ప్రభావానికి గురైంది. బుడమేరు ఉద్ధృతితో నగరంలో పలు ప్రాంతాలు నీట మునగ్గా.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచిన ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) గత వారం రోజులుగా విజయవాడలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. ముంపు బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా చర్యలు చేపట్టారు. అటు, తెలంగాణలోనూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వందల సంఖ్యలో బాధితులు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు ధ్వంసం కాగా కట్టుబట్టలతో మిగిలారు. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఇల్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10,000 అందించారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. భారీగా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్
తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తామని.. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపినట్లు చెప్పింది. వరదలు, డ్యాంలు, వాటి భద్రతను కేంద్ర బృందం పరిశీలించిందని పేర్కొంది. 'తెలంగాణలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 వైమానికదళ హెలికాఫ్టర్లు ఉన్నాయి. ఇవి 68 మంది రక్షించాయి. 3,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఏపీలోని 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 వైమానికదళ హెలికాఫ్టర్లు, 3 నౌకాదళ హెలికాఫ్టర్లు, డోర్నియల్ ఎయిర్ క్రాఫ్ట్ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రాష్ట్రంలో 350 మందిని కాపాడి 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.' అని ట్వీట్‌లో పేర్కొంది.
26 teams of @NDRFHQ & 8 helicopters of @IAF_MCC, 3 helicopters and 1 Dornier aircraft of @indiannavy have been mobilized in Andhra Pradesh. 7 teams of NDRF, 2 helicopters of IAF have been mobilized in Telangana for rescue and relief activities. @HMOIndia @PIB_India pic.twitter.com/EqSDVFnwY1
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) September 6, 2024
Also Read: Vijayawada Floods: విజయవాడ వరదలు - కరెంట్ బిల్లుల చెల్లింపుపై ఉపశమనం, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు