Amaravati Capital : బడ్జెట్‌లో అమరావతికి నిధులు కేటాయించిన కేంద్రం - ఏపీ రాజధానిపై క్లారిటీ వచ్చినట్లేనా ?
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాజధానికి నిధులు కేటాయించారు. పట్టణాభివృద్ధి శాఖ నుంచి విభజన చట్టం ప్రకారం నిధులు విడుదల చేస్తారు. దీంతో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించినట్లేనని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అమరావతిని ( Amaravati ) అధికారికంగా గుర్తించింది. 2022-23 బడ్జెట్‌లో ( Budget ) నిధులు కూడా కేటాయించింది. ఇటీవల మూడు రాజధానుల బిల్లులను ( Three Capital Bills ) ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బడ్జెట్ సమావేశాల్లో కొత్త బిల్లులను ప్రవేశ పెడతామని చెబుతోంది. అయితే ఈ లోపే అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ధారిస్తూ విభజన చట్టం ప్రకారం నిధులు కూడా కేటాయించడంతో కేంద్రం ( Central Governament ) కూడా ఈ అంశానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లుగా భావిస్తున్నారు.
బడ్జెట్ ప్రొవిజన్స్‌లో కూడా ఏపీ నూతన రాజధాని అమరావతి ( Amaravati ) అనే పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని కోసం కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. సచివాలయ నిర్మాణానికి రూ. 1214 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణాలకు రూ. 1126 కోట్లు, ఏజీ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ. మూడు వందల కోట్లు అంచనాలను వేశారు. కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో నిర్మాణాలకు నిధులు కేటాయించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేటాయింపులపై పూర్తి స్థాయి నివేదిక బయటకు రావడంతో అమరావతికి నిధఉల కేటాయింపు అంశం వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్ల బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు..కానీ చాలా స్వల్పంగా కేటాయించారు.
ఇటీవల పార్లమెంట్‌లో ( Parlament ) కూడా ప్రస్తుతం ఏపీకి రాజధాని అమరావతినేనని కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుందని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం అమరావతిలో పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు కేటాయించారు. ఆ భూముల్లో కొన్ని సంస్థలు నిర్మాణాలు ప్రారంభించలేదు. ఇటీవల నిర్మాణాలు ప్రారంభించాయి. ఆర్బీఐ కూడా త్వరలోనే తమ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ( Assembly Meetings ) మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెడతామని ఏపీ మంత్రులు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే హైకోర్టులో కేసు ఇంకా తేలలేదు. తీర్పు రిజర్వ్‌లో ఉంది. తీర్పు రాకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టినా అది చట్ట విరుద్దమవుతుంది. ఒక వేళ తీర్పులో రైతుల అభ్యంతరాలను అంగీకరించి విచారణ కొనసాగించాలని హైకోర్టు ( AP HighCourt ) నిర్ణయిస్తే మళ్లీ బిల్లు పెట్టడం ఏపీ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఓ వైపు కేంద్రం అమరావతిని రాజధానిగా గుర్తించడం మరో వైపు బిల్లుపెట్టడంపై న్యాయపరమైన సందేహాలు ఉండటంతో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులపై ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.