BJP Leaders On CM Jagan: విశాఖలో పులివెందుల కబ్జా బ్యాచ్ తిష్ట - వైసీపీపై బీజేపీ లీడర్ల తీవ్ర ఆరోపణలు
Ramesh On CM Jagan: విశాఖలో పులివెందుల కబ్జా బ్యాచ్ తిష్ట వేసిందని... భూ కబ్జాలు చేస్తోందని ఆరోపించారు బీజేపీ నేతలు
BJP On CM Jagan: విశాఖ పర్యటనకు ప్రధాని మోదీ రావడం ఏమోగానీ... బీజేపీ వైసీపీ మధ్య మాత్రం మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ అరాచకాలు చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు బీజేపీ లీడర్లు. విశాఖలో పులివెందుల కబ్జా బ్యాచ్ తిష్ట వేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
15 వేల కోట్ల రూపాయల నిధులతో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర పథకాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు వస్తుండగా.. జగన్ సర్కారు మాత్రం ప్రధాని పర్యటన పేరిట కూల్చి వేతలు సాగిస్తున్నారని బీజేపీ నేత పురంధేశ్వరి ఆరోపించారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, టైము ఇవ్వకుండా పేదల ఇళ్లు, షాపులు కూల్చి వేశారని ఆరోపించారు. మరి భూకబ్జాలు చేసిన వారి మీద ఎందుకు అలా చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఈ విధ్వంసానికి దడిసే.. రాష్ట్రంలోకి పెట్టుబడి దారులు రావటం లేదని తెలిపారు. దిల్లీ లిక్కర్ స్కాములో ఈ రోజు అరెస్టయిన వారు ఎవరికి దగ్గరి వారని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి ఎవరి మనిషి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవిందో ఎవరిది అంటూ ఫైర్ అయ్యారు.
విశాఖ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తూ కబ్జాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. దసపల్లా భూముల కుంభకోణం మీద సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజలు వీటిలో ఫ్లాట్లు కొంటే నష్టపోతారని తెలిపారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదని సూచించారు.
విశాఖలో భూముల ల్యాండరింగ్ జరిగింది, దసపల్లా సహా భూముల ఆరోపణలపై ఈడీ, సీబీఐ విచారణ ఖాయం. విశాఖలో లిటిగేషన్లో ఉన్న భూములు ఎవరూ కొనవద్దు. ఢిల్లీ లిక్కర్ స్కాం అరెస్టులతో వ్యవహారమంతా బయటపడుతుంది.
— Dr. CM Ramesh (@CMRamesh_MP) November 10, 2022
విశాఖలోనూ, ఏపీలోనూ కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు చేపడుతోందన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయనకు వివక్ష లేదని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధం అని విమర్శించారు. అక్రమాలకు అన్యాయాలకు ఎక్కడ అవకాశం ఉందా అని వెతుకుతుంటారని ఆరోపించారు.
కక్ష సాధింపు చర్యలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు సత్యకుమార్. భూసర్వేలకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి దానిలో అవినీతి ఎలాగో వెతుకుతారన్నారు. వివాదాలు సృష్టించి, భయపెట్టి భూములు కాజేస్తున్నారని ఆరోపించారు. భూరక్ష, భూహక్కు పథకం పేరుతోనూ చేస్తుందంతా భూకబ్జాయేనన్నారు. పెందుర్తిలో 40 ఎకరాల భూకబ్జా చేసిన మంగలికృష్ణ ఎవరు? ఎన్ని కేసులున్నాయి? అని ప్రశ్నించారు. విశాఖలో పులివెందుల కబ్జా బ్యాచ్ తిష్ట వేసిందని తీవ్రంగా విమర్శలు చేశారు.
ఇటీవలే తిరుపతిలో వైసీపై ఫైర్ అయిన సీఎం రమేష్
ఏపీ పరిస్థితి చాల క్లిష్టంగా ఉందని, ఇదే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. అప్పులు తీసుకొని వచ్చి, వడ్డీలు కట్టే స్థితిలో ఏపీ ప్రభుత్వం లేదని విమర్శించారు. ప్రజలకు ప్రయోజనం ఉండే పనులు సైతం ఏపీ ప్రభుత్వం చేపట్టడం లేదని ఆరోపించారు. ఎక్కడైనా సరే ఉద్యోగాలు, రెవెన్యూ జనరేషన్ ఉండాలి కానీ అలాంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు.
తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు సీఎం రమేష్ కు స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిచ్చు పెట్టి, రాజధాని మార్చాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలపై ఆరోపణలు చేశారు. అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వంలో తీర్మానం చేయగా అన్ని పార్టీలు అప్పుడు అంగీకరించాయన్నారు. ఇప్పుడు భేషజాలకు పోయి వైసీపీ మంత్రులు, నేతలు రకరకాలుగా బయట మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజా రాజధాని కేవలం అమరావతి మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి కోసం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని సీఎం రమేష్ స్పష్టం చేశారు.