Budvel News : బద్వేలు నామినేషన్లు ప్రారంభం ! బీజేపీ -జనసేన అభ్యర్థి ఎవరు ?
బద్వేలు ఉపఎన్నికలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యాయి. బీజేపీ - జనసేన కూటమి ఇంకా ఎవరు పోటీ చేయాలో నిర్ణియంచుకోలేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. శుక్రవారం నుంచి నామినేషన్లు కూడా స్వీకరిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇక బరిలో ఉండాల్సిన మరో ప్రధాన కూటమి అభ్యర్థి ఎవరో తేలలేదు. ఎవరు పోటీ చేస్తారో ఆ రెండు పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. బీజేపీ - జనసేన ఈ విషయంలో ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలో తేల్చుకోలేకపోయారు.
ఎవరు పోటీ చేయాలో ఇంకా తేల్చుకోని బీజేపీ -జనసేన !
బద్వేలు ఉపఎన్నిక నోటిఫికేషన్ పండుగ సీజన్ అయిపోయిన తర్వాత వస్తుందని అనుకున్నారు. అందుకే అటు జనసేన కానీ ఇటు బీజేపీ కానీ ఎవరు పోటీ చేయాలన్నదానిపై చర్చలు జరపలేదు. షెడ్యూల్ ప్రకటించేసిన తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి ఉపఎన్నికపై చర్చించారు. ఈ చర్చల్లో ఎవరు పోటీ చేయాలన్నదానిపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి జనసేన తన అభిప్రాయాలు చెప్పింది. వీటిని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి చెబుతామని సోము వీర్రాజు సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read : మంత్రి మేకపాటి ఇలాకాలో వైసీపీ వర్సెస్ వైసీపీ.. అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు..
ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్న ఏపీ బీజేపీ నేతలు!
తిరుపతి ఉపఎన్నికల సమయంలోనూ రెండు పార్టీలు తాము అంటే తాము పోటీ చేస్తామని పోటీ పడ్డాయి. చివరికి బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దించారు. జనసేన మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కూడా బీజేపీ పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అన్ని ఎన్నికల్లోనూ మీరే ఎలా పోటీ చేస్తారని .. బద్వేలులో తాము పోటీ చేస్తామని జనసేన అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీకి అక్కడ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జయరాములు విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన రకరకాల పార్టీలు మారారు. చివరికి 2019లో బీజేపీ తరపున పోటీ చేశారు.
Also Read: ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్
బద్వేలులో రెండు పార్టీలకు లేని కనీస ఓటు బ్యాంక్ !
2019 ఎన్నికల్లోనూ జనసేన పార్టీ అక్కడ పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా బహుజన సమాజ్ పార్టీకి కేటాయించారు. బీఎస్పీ అభ్యర్థి 1321 ఓట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచారు. ఇక ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేసిన బీజేపీ 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు కూడా బీజేపీ తరపున పోటీ చేసింది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జయరాములే. అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితి మారిందని బీజేపీ భావిస్తోంది. జనసేనకు కూడా బలమైన అభ్యర్థి ఎవరూ లేరు. కొత్త వారిని నిలబెట్టాలి. అలా నిలబెట్టిన తర్వాత అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి.
Also Read : మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?
చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలుగుతారా ?
బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థి బరిలో ఉంటారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే భార్యకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చినందున.. మానవతా దృక్పథంతో పోటీ నుంచి విరమించుకుంటున్నామని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సోము వీర్రాజు మాత్రం తాము ఖచ్చితంగా బరిలో ఉంటామని ప్రకటిస్తారు. కానీ అభ్యర్తి విషయంలో ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తసుకోలేదు.
Watch Video : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?