YS Avinash : నాలుగోసారి నాలుగు గంటలు - వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ !
అవినాష్ రెడ్డిని నాలుగో సారి నాలుగు గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
YS Avinash : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగోసారి ప్రశ్నించింది. దాదాపుగా నాలుగున్నర గంటల పాటు ఆయనను హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీసులో ప్రశ్నించింది. సోమవారం హైకోర్టు మేరకు తుది తీర్పు ఇచ్చే వరకూ అరెస్ట్ చేయవద్దని ఇచ్చిన ఆదేశాల మేరకు అరెస్ట్ చేయరని క్లారిటి రావడంతో ఈ సారి సీబీఐ ఆఫీసు దగ్గర పెద్దగా హడావుడి కనిపించలేదు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సీబీఐ ఆఫీసుకు వెళ్లిన అవినాష్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటల సమయంలో బయటకు వచ్చారు. ఆయన విచారణకు ఈ సారి న్యాయవాది కూడా హాజరయ్యారు. గతంలో చేసిన విచారణకు కొనసాగింపుగా ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది.
గత విచారణ సందర్భంగా సీబీఐ ఆఫీసు ముందు మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి సీబీఐపై చాలా విమర్శలు చేశారు. అలాగే దర్యాప్తు జరుగుతున్న తీరునూ ఖండించారు. కేసులో కొత్త కోణాలు ఆవిష్కరించి హత్య ఎందుకు జరిగిందో చెప్పారు. అయితే సీబీఐ దర్యాప్తు జరుగుతూండగా.. ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటని హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సారి మీడియాతో మాట్లాడకుండానే అవినాష్ రెడ్డి వెళ్లిపోయారు. మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
కడప నుంచి ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాశారు. తాను ఎంపీనని తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని.. విచారణ నుంచి మినహాయింపు కావాలని ఆయన సీబీఐకి లేఖ రాశారు నిజానికి హైకోర్టులోనే ఈ వాదన వినిపించారు. విచారణ నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. అయితే హైకోర్టు మాత్రం విచారణలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. సీబీఐకే విజ్ఞప్తి పెట్టుకోవాలని చెప్పింది. హైకోర్టు సూచన మేరకు అవినాష్ రెడ్డి.. సీబీఐకి లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విచారణకు రాలేనని చెప్పారు. అయితే ఈ అంశంపై సీబీఐ స్పందించలేదు.దీంతో చివరికి అవినాష్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా సీబీఐ విచారణకు హాజరయ్యారు.
ప్రస్తుతం అవినాష్ రెడ్డికి సీబీఐ అరెస్ట్ చేయకుండా రక్షణ ఉన్నట్లే. హైకోర్టులో వచ్చే తుది తీర్పు ను బట్టే సీబీఐ తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు తుది తీర్పు ఎప్పుడు ఇస్తుందన్న స్పష్టత లేదు.కానీ విచారణ మాత్రం జరుగుతుంది. దర్యాప్తులో తేలిన అంశాలను బట్టి తాము అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నామని హైకోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు. అయితే హైకోర్టు.. తుది తీర్పు వరకూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చి తీర్పు రిజర్వ్ చేయడంతో అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్లయింది.