Ysrcp Protests : వైసీపీలో కేబినెట్ ముసలం, కన్నీళ్లు పెట్టుకున్న కోటంరెడ్డి, పలు చోట్ల నిరసనలు
Ysrcp Protests : వైసీపీలో కేబినెట్ ముసలం రాజుకుంది. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. మంత్రి పదవుల ఆశించిన నేతల అనుచరుల్లో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి.
Ysrcp Protests : ఏపీ కొత్త కేబినెట్ వైసీపీ ముసలం పుట్టించింది. మంత్రి వర్గంలో మా నేతలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తున్నారు. సీనియర్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. పలువురు రాజీనామా చేసేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం. కృష్ణా జిల్లాకు మంత్రి పదవుల్లో అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఒక్కరికే మంత్రి పదవి దక్కడంపై ఆందోళనలకు దిగారు.
కృష్ణా జిల్లాకు అన్యాయం చేశారని ఆందోళన
కృష్ణాజిల్లాలో పెడన నియోజకవర్గానికి చెందని జోగి రమేష్‌కు మంత్రి పదవి దక్కింది. ఎన్‌టీఆర్ జిల్లాలో ఎవరికీ మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో సీనియర్ నేత, మాచర్ల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు రెంటచింతలలో ప్రధాన రహదారిపై ఆయన అనుచరులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు తగలపెట్టారు. ఈ రాస్తారోకో నిరసన కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం మహిళ నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు.
సీఎం డౌన్ డౌన్
ఒంగోలులో బాలినేని అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నూతన మంత్రివర్గ కూర్పులో బాలినేనికి చోటు దక్కకపోవడంతో ఆందోళన బాటపట్టారు. ఒంగోలులో మంగమురు రోడ్డు జంక్షన్ లో బాలినేని అభిమానులు ఆందోళన చేపట్టారు. బాలినేని శ్రీనివాసరెడ్డి నూతన మంత్రి వర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఒంగోలు వైసీపీ కార్యాలయం దగ్గరికి భారీగా చేరుకుని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
కేబినెట్ ముసలం
వైసీపీలో కేబినెట్ ముసలం రాజుకుంది. మంత్రి పదవుల్లో అన్యాయం జరిగిందని వైసీపీ కార్యకర్తలే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కోటంరెడ్డి అనుచరులు వైసీపీకీ రాజీనామా చేశారు. మంత్రి పదవి దక్కలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదనతో కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న తాను మంత్రి పదవి ఆశించానన్నారు. మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించిందన్నారు. కార్యకర్తలు, నాయకులు తమ రక్తం చెమటగా మార్చి తన కోసం కష్టం చేస్తే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానన్నారు. ఎవరు కూడా రాజీనామాలు చేయవద్దని ఆయన కోరారు. మంత్రి పదవి దక్కకపోవడం నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టించింది. నిస్వార్థ సేవ కూడా గుర్తింపు కోరుకుంటుందన్నారు. పార్టీ కోసం మొదటి అడుగు నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ నడిచానన్నారు. తన సేవను, కష్టాన్ని గుర్తించకపోవడం బాధ కలిగించిందన్నారు.
మేకతోటి సుచరిత అసంతృప్తి!
మంత్రి పదవి దక్కకపోవడంతో మేకతోటి సుచరిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎస్సీ మంత్రులందరినీ కొనసాగిస్తూ తనను తప్పించడానికి తాను చేసిన తప్పు ఏమిటని ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాకు మేకతోటి సిద్ధపడినట్లు సమాచారం. రెండు రోజులుగా సజ్జలను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదన్నారు. సుచరిత అభిమానులు, దళిత సంఘాలు ఆమె ఇంటికి చేరుకుంటున్నారు.