రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు
Dharmana Prasada Rao: సీఎం జగన్ అనుమతి ఇస్తే తన పదవికి రాజీనామా చేసి విశాఖ రాజధాని ఏర్పాటు కోసం ఉద్యమంలో చేరేందుకు సిద్ధం అని మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రకటించారు.
Dharmana Prasada Rao News: మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ రాజధాని కోసం అవసరమైతే రాజీనామా చేసి ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని ప్రకటించారు. విశాఖలో నూతనంగా ఏర్పాటయిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ కామెంట్స్ చేశారు.
60 ఏళ్లుగా రాజధానితో తిప్పలు తప్పట్లేదు..
రైతుకు మద్దుతుగా నిలిచే సందర్భంలో ఈ ప్రభుత్వం అందరి కన్నా ముందు ఉందని మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. అయితే ఇప్పుడు విశాఖపట్నం ప్రాంతానికి వచ్చిన కష్టం రాజధాని అని తెలిపారు. గతంలో చెన్నయ్ రాజధానిగా ఉండగా.. 1100 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దాని వల్ల అనేక అవస్థలు పడ్డామన్నారు. ఆ తర్వాత రాజధానిని కర్నూలుకు మార్చగా.. ఎనిమిది వందల కిలో మీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదన్నారు. అక్కడికి చేరుకోవాలంటే రెండు రోజుల సమయం పట్టేదని... దీని వల్ల కూడా చాలా సమస్యలు ఎదుర్కున్నామని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక హైదరాబాద్ ను రాజధానిగా చేశారని.. అది కూడా విశాఖకు చాలా దూరం అని చెప్పారు.
ఇలా 60 సంవత్సరాలకు పైగా రాజధానికి వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డామని మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. విశాఖకు రాజధాని వస్తే మన ప్రాంతం అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు 130 ఏళ్ల తర్వాత విశాఖకు రాజధాని ఏర్పాటు అయ్యే అవకాశం వస్తే చంద్రబాబు వద్దని చెప్తున్నారని అన్నారు. మీకు రాజధాని వద్దు, మీకు అభివృద్ధి వద్దు అంటూ అమరావతి రైతులు ఇక్కడికి యాత్రగా వస్తున్నారని తెలిపారు. అమరావతి రైతుల కోసం విశాఖ ప్రజల నోట్లో మట్టి కొడితే ఎలా అని ప్రశ్నించారు.
ఏంటీ ఈ అన్యాయం.. ?
ఒక్క వయసొచ్చిన కుర్రాడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడా అని మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రశ్నించారు. వలస పోయిన యువత కోసం తల్లిదండ్రులు నిరీక్షణలు ఇప్పటికీ తప్పడం లేదన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు మరణిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయన్నారు. ఇంతటి దయనీయ పరిస్థితుల్లో మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని మాకు అన్యాయం చేస్తామని చెప్పడం తగదని అన్నారు. విశాఖ ప్రజలు ఎవరి దగ్గరా తలవంచాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు. విపక్షాల విష ప్రచారాన్ని తిప్పి కొట్టండని ప్రజలకు సూచించారు. ఇలాంటి వాళ్లకు శత్రువులుగా చూడాలని అన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రజలంతా ఉద్యమం చేయాలన్నారు. ముఖ్యమంత్రి అనుమతి ఇస్తే తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధం అని మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రకటించారు. తాను ముందు నడిస్తే లక్షలాది మంది తన వెనుక వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి పౌరుడూ చైతన్యవంతం కావాలన్నారు.
అమెరికా వ్యవసాయంపై ఆధారపడిన వారి సంఖ్య కేవలం నాలుగు శాతమేనని, మన దేశంలో 65 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధార పడ్డారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అందరూ గిట్టుబాటు ధర వచ్చే పంటలనే వేయాలని సూచించారు. వ్యవసాయం చేసిన వాడిగా ఒక రైతు కష్టసుఖాలు తనకు తెలుసు అని అన్నారు. రక్తం ధారపోసే రైతుకు కేంద్రం ప్రభుత్వం ఏమాత్రం సాయం చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే సాయం చేస్తే అందరికీ అభివృద్ధి ఫలాలు అందవి.. కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయ ల్యాబులు పెట్టడం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు వంటివి చేసి రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. అందుకు వ్యవసాయ కమిటీలు రైతులకు చేదోడు నిలబడాలని సూచించారు. మూకళ్ల తాతబాబు అధ్యక్షుడిగా ఏర్పాటయిన ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ క్రమశిక్షణతో పనిచేయాలి సూచించారు.