AP Teachers: పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చలు విఫలం, ఉద్యమాన్ని కొనసాగిస్తాం : ఉపాధ్యాయ సంఘాలు
పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నాయి.
పీఆర్సీపై ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చర్చల సఫలయ్యాయి. కానీ ఉపాధ్యాయుల సంఘాలు చర్చలు విఫలమయ్యాయని ప్రకటించారు. శనివారం రాత్రి చర్చల సమయంలో ఉపాధ్యాయ సంఘాలు మధ్యలో వచ్చేశాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత చిన్న అపశ్రుతి అన్నారు. పీఆర్సీపై ప్రభుత్వంతో ఉపాధ్యాయులు జరిపిన చర్చలు విఫలమయ్యాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఉపాధ్యాయ సంఘాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు హెచ్‌ఆర్‌ఏ 10 శాతం మాత్రమే ఇస్తామంటున్నారని, టీచర్లకు కనీసం 12 శాతం హెచ్ఆర్‌ఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది సాధ్యం కాకపోతే పాత హెచ్‌ఆర్‌ఏ విధానాన్నే అనుసరించాలన్నారు. టీచర్లకు 27 శాతానికి పైగా ఫిట్‌మెంట్ కోరుతున్నామన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఇవ్వడంలేదన్నారు.
కడపలో ఎస్టీయూ నిరసన
ఉపాధ్యాయ, ఉద్యోగుల పీఆర్సీపై ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించాల్సిన నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కై పోరాటాన్ని నీరు గార్చారని ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పీఆర్సీ సాధన సమితి నేతల దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. కడప జిల్లా పొరుమామిల్ల పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ లో ఎస్టీయూ ఆధ్వర్యంలో పీఆర్సీ సాధన సమితి నాయకులు సూర్యనారాయణ, బండి శ్రీనివాసరావు, బొప్పరాజువెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డిల దిష్టి బొమ్మలను ఊరేగించారు. ఎస్టీయూ రీజినల్ కార్యదర్శి పుల్లయ్య, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాద్యాయులు పీఆర్సీ సాధన కోసం అనేక కష్టాలు ఓర్చి విజయవాడను దిగ్బంధం చేస్తే ఒక్కనిమిషంలో అందరి ఆశలు గల్లంతు చేశారని విమర్శలు చేశారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయారని తీవ్రంగా మండిపడ్డారు. వారి ఆధ్వర్యంలో జేఏసీ పని చేయదని, తామే కార్యాచరణ సాగించి పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.
విశాఖలో ఏపీటీఎఫ్ ధర్నా
విశాఖలో జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఏపీటీఎఫ్ నిరసన తెలియజేసింది. పీఆర్సీ సాధన సమితి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఉద్యమాన్ని ఒక్క రాత్రిలో నిర్వీర్యం చేసిందన్నారు. సమాన పనికి సమాన వేతనం అని చెప్పి ఇంకా కాంట్రాక్టు, అవుట్ సోర్స్ ఉద్యోగులకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో ఉద్యమ నాయకులు ఏ విధంగా ప్రణాళిక రచిస్తారో ఆ విధంగా ముందుకు సాగుతామన్నారు. జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నూతన పీఆర్సీ జీవోలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. తమతో కలసివచ్చే సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఇప్పటికే పెన్ డౌన్ నోటీసు ఇచ్చామని ఇక రేపటి నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకునే వరకు వెనుకడుగు వేసేది లేదని ఏపీటీఎఫ్ నాయకులు చెబుతున్నారు. మూడవ తేదీ చలో విజయవాడ విజయవంతం అయిన తర్వాత ప్రభుత్వంతో అందరి సమస్యల పరిష్కారానికి సాధన సమితి కృషిచేయాలని కానీ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఈ రోజు సంబరాలు చేసుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత హెచ్ఆర్ఏ కొనసాగించాలని సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఉంచాలని డిమాండ్ చేశారు.