పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చలు జరిపినా.. ఎలాంటి ఉపయోగం లేదు: ఉద్యోగుల సంఘం నేతలు
ఏపీలో పీఆర్సీపై వివాదం నడుస్తూనే ఉంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదంటూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా.. లేదంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు చెప్పారు. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మను కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ.. ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండే బాగుండేదని చెప్పారు.
2010లోనే అప్పటి పీఆర్‌సీ సిఫార్సుల మేరకు 39 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సిందన్నారు. కిందటి ప్రభుత్వం కూడా ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని.. 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినట్టు చెప్పారు. తెలంగాణలోనూ 30 శాతంగా పీఆర్సీ ఉందని.. పీఆర్సీ సంఘం సిఫార్సు మేరకు ఇంటి అద్దె భత్యం, సీసీఏలు.. కొనసాగడమే కాకుండా హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు.. ఇచ్చే భత్యాలు అలాగే కొనసాగించాలని కోరారు.
70-79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలని.. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రోబేషన్ డిక్లేర్ చేయాలని.. 1993 నుంచి పనిచేస్తున్న 5 వేల మంది కంటింజెంట్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలన్నారు. ఈ మేరకు సీఎస్ కు రాసిన లేఖలో వివరించారు.
Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?