Jagananna Amma Vodi Scheme : అమ్మ ఒడి పథకం లబ్ధిదారులకు షాక్, మరో రూ.వెయ్యి కోత!
Jagananna Amma Vodi Scheme : అమ్మ ఒడి పథకానికి వైసీపీ ప్రభుత్వం కోతలు పెడుతోంది. ఇప్పటికే పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి కట్ చేస్తున్న సర్కార్ తాజాగా మౌలిక సదుపాయాల పేరుతో మరో వెయ్యి కోత పెట్టనుంది.
Jagananna Amma Vodi Scheme : వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం కింద ఇస్తున్న రూ.15 వేలలో వెయ్యి కోత పెట్టనుంది. తాజా కోతతో మొత్తంగా రూ.2 వేలకు తగ్గనున్నాయి. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో అమ్మఒడిలో రూ.వెయ్యి తగ్గించారు. ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ.వెయ్యి మినహాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అమ్మ ఒడి పథకం కింద జూన్‌లో రూ.13 వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. లబ్ధిదారుల నుంచి మినహాయించిన మొత్తాన్ని పాఠశాల విద్యాశాఖ ద్వారా బడుల నిర్వహణకు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాస్థాయి అధికారులకు సమాచారం అందించారు. నవంబరు 8 నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యార్థి హాజరు 75 శాతం ఉంటే అమ్మఒడి నగదు జమ చేస్తారు. అమ్మఒడి పథకాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేయలేదు. గతేడాది జనవరి 11న ఈ పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజా ఈ ఏడాది విద్యార్థుల హాజరు పేరుతో జూన్‌లో నగదు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
మరుగుదోడ్ల నిర్వహణ పేరుతో కోత
బడికి వెళ్లే చిన్నారులు ఉన్న కుటుంబంలో ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు అందిస్తామని 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది కుటుంబంలో ఒక్కరికే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. ఈ మొత్తంలో స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1,000 కోత పెట్టి రూ.14 వేలు అకౌంట్లలో జమ చేస్తున్నారు. తాజాగా రూ.2000 తగ్గించి పథకాన్ని రూ.13 వేలకు తగ్గించారు. ఈ రెండు వేలను పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. అయితే ప్రభుత్వం అమ్మఒడి నుంచి మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు మినహాయిస్తుంది. దీంతో అమ్మఒడి పథకంపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులైన అమ్మలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లకే కుదించి
అయితే తాజా కోతలతో అమ్మఒడి పథకం అమలు తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అమలు చెయ్యాల్సిఉంది. అయితే ప్రభుత్వం దీనిని నాలుగేళ్లకే కుదించింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండేళ్లపాటు జనవరి నెలలో అమ్మఒడిని ఇచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాది ఆరు నెలలు ముందుకు జరిపి జూన్‌కు ఈ పథకాన్ని వాయిదా వేసింది. 2022 జూన్‌లో ఇస్తే మళ్లీ 2023 జూన్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. 2024 మే నెలలోనే ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఏడాది అమ్మఒడి పథకాన్ని అమలు చెయ్యాల్సిన అవసరం ఉందని సర్కారు ప్లాన్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాకాకుండా జనవరిలోనే అమ్మఒడి ఇస్తే, 2023, 2024లోను జనవరిలోనే నగదు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వం ఇలా చేస్తుందని ఆరోపిస్తున్నారు.