Laptops To Students: జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన స్థానంలో ల్యాప్‌టాప్‌లు... టెండర్లు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన స్థానంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు టెండరు విలువ రూ. వంద కోట్లు దాటడంతో న్యాయసమీక్షకు పంపించింది.
విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల అంగీకారంతో జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన స్థానంలో ల్యాప్‌టాప్‌లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక స్థాయి కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌లు, లేటెస్ట్ హై కాన్ఫిగరేషన్‌తో 90,926 ల్యాప్‌టాప్‌లు కొనుగోలుకు చేయాలని, అందుకు టెండరు ఆహ్వానిస్తోంది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ల్యాప్‌టాప్‌ల సరఫరాకు బిడ్లు ఆహ్వానించింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు టెండరు విలువ రూ. వంద కోట్లు పరిమితి దాటడంతో టెండరు నోటీసులోని అంశాలను న్యాయసమీక్షకు పంపించింది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడి సందడి.. ఖైరతాబాద్ లో భక్తుల కిటకిట.. కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు
అభ్యంతరాలు ఉంటే
ఈ నెల 17 లోగా ఈ ప్రక్రియపై అభ్యంతరాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం కోరింది. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా జ్యూడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్‌కు ఈ అభ్యంతరాలు, సూచనలు, సలహాలు పంపాలని ప్రభుత్వం కోరింది. కాగా పథకాల నగదుకు బదులు ల్యాప్‌టాప్‌లు అందుకున్న విద్యార్థులు వాటిలో ఏమైనా లోపాలు తలెత్తితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేస్తే వారం రోజుల్లో ఆయా కంపెనీలు సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ లకు మూడేళ్ల వారెంటీ ఉంటుంది. ఇప్పటికే ఆ దిశగా జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
డిజిటల్ దిశగా
విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతో పాటు కరోనా వంటి పరిస్థితులు అభ్యాసనాన్ని కొనసాగించేందుకు వీలుగా ల్యాప్ టాప్ లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ మంజూరు చేస్తోంది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులకు మేలు జరగనుందని తెలిపింది. భోజన వసతి సదుపాయాల కోసం జగనన్న వసతి దీవెన కింద ఏటా రూ. 20 వేలు విద్యార్థులకు అందిస్తోంది. 2021-22 విద్యా సంవత్సరానికి గాను జగనన్న వసతి దీవెన కింద ఇచ్చే నగదుకు బదులు ల్యాప్ టాప్ లు కావాలని కోరుకునే వారికి వీటిని అందించనున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు కోరుకున్నట్లు బేసిక్ కన్ఫిగరేషన్ తో కూడుకున్న ల్యాప్ టాప్ లేదా అడ్వాన్స్ డ్ ల్యాప్ టాప్ ఇవ్వనున్నారు. ఈ ల్యాప్ టాప్ లలో ఏమైనా లోపాలు తలెత్తినట్లయితే విద్యార్థులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు.