Governer Delhi : ఢిల్లీలో ఏపీ గవర్నర్ మూడు రోజుల పర్యటన ! కేంద్రానికి నివేదికలిస్తారా ?
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మూడు రోజుల పర్యటనకు ఢిల్లీకి వెళ్తున్నారు. ఓ రోజు రాష్ట్రపతి నేతృత్వంలో జరిగే గవర్నర్ల సదస్సులో పాల్గొంటారు. ఏపీలో ఉన్న పరిస్థితులపై కేంద్రానికి నివేదికలు ఇచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన హస్తినలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలో డిల్లీలో గవర్నర్ల సదస్సు జరగనుంది. గురువారం జరిగే ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు అవుతారు. ఏపీ పరిస్థితులపై గవర్నర్.. రాష్ట్రపతికి నివేదిక అందిస్తారు. ఒక్క బిశ్వభూషణే కాకుండా అన్ని రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి నివేదికలు సమర్పిస్తారు. ఇదంతా రొటీన్‌గా జరిగే సమావేశమే.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !
అయితే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ .. రాష్ట్రపతితో సమావేశానికి ముందే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అవనున్నారు. మర్యాదపూర్వక భేటీనేనని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. అయితే గవర్నర్ మరికొన్ని ముఖ్యమైన సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇటీవల ఉద్రిక్తంగా మారాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వివిధ అంశాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు ఇచ్చినట్లుగా చెప్పారు. రాష్ట్రపతి పాలన విధించాలని కోరినట్లుగా వారు తెలిపారు.
Also Read : రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?
ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రాష్ట్రపతిని కలిసి.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు. ఈ పరిణామాల కారణంగా గవర్నర్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడుల విషయంలో కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు చేసినా అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్రపతి కానీ ఎలాంటి వివరాలను ఆరా తీయలేదని.. అందుకే గవర్నర్ ప్రత్యేకంగా నివేదిక ఇచ్చే అవకాశం లేదని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని.. ఆ దిశగా గవర్నర్ ఎలాంటి నివేదికలు ఇవ్వరని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రతిపక్షంపై దాడుల విషయంలోనే కాకుండా ఏపీ ఆర్థిక పరిస్థితి విషయంలోనూ ఇటీవల గవర్నర్ కొన్ని కీలక విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గవర్నర్ సావరిన్ ఇమ్యూనిటీని తాకట్టు పెట్టి రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ కింద రుణం తీసుకోవడం.. దాన్ని బడ్జెట్ పద్దుల్లో చూపించకపోవడం వంటివి గవర్నర్ తన నివేదికలో వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే అధికార పార్టీ వర్గాల్లో గవర్నర్ టూర్‌పై కాస్తంత టెన్షన్ నెలకొంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి