(Source: ECI/ABP News/ABP Majha)
AP Assembly Sessions : 21 నుంచే ఏపీ అసెంబ్లీ - సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ
Andhra News : 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే స్పీకర్ ఎన్నిక పూర్తి చేస్తారు
AP Assembly Sessions From June 21st : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను 21, 22 తేదీల్లో నిర్వహించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. మొదట 19వ తేదీ నుంచి అనుకున్నారు.. తర్వాత మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోకపోవడం వల్ల 24వ తేదీకి మార్చారు. అయితే ఇప్పుడు ముందుగా సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయడానికి 21, 22 తేదీల్లో అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు పేరును చంద్రబాబు ఖరారు చేశారు. అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ పదవికి పోటీ పడే బలం వైసీపీకి లేదు. అందుకే వైసీపీ పోటీ చేసే అవకాశం లేదు. అలాగే అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఉంటే... మద్దతు తెలిపే అవకాశం కూడా ఉండదని అంచనా వేస్తున్నారు. సభా సంప్రదాయాల ప్రకారం.. అసెంబ్లీలోని వివిధ పార్టీలో శానసభాపక్ష నేతలందరూ.. స్పీకర్ ను చెయిర్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. ఈ సారి ఆ సంప్రదాయాన్ని వైసీపీ పాటించడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు. ఆయనే స్పీకర్ గా ఎన్నికవనుండటంతో.. మరో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల విషయంలో వైసీపీ కూడా కన్ ఫ్యూజ్ అయింది. మొదట 19వ తేదీన అసెంబ్లీ సమావేశాలని ప్రచారం జరగడంతో 18వ తేదీన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనుకున్నారు. కానీ ఇరవై నాలుగో తేదీకి వాయిదా పడటంతో తమ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్ని కూడా వాయిదా వేసుకున్నారు. 22వ తేదీన నిర్వహించాలనుకున్నారు. సీఎం జగన్ రెండు రోజుల పులివెందుల పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
మంగళవారం ఆయన పులివెందులకు వెళ్లి రెండు రోజుల పాటు అక్కడ ఉండి 21వ తేదీన తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. 22వ తేదీన కార్యవర్గ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించాలనుకున్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ షెడ్యూల్ రివర్స్ లోకి వచ్చింది. ముందుగు రావడంతో జగన్ ఏం చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలంటే 20వతేదీలోపే నిర్వహించాలి.
అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నదానిపై వైసీపీ వైపు నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అయితె ఎమ్మెల్యేగా గెలిచిప్పటికీ ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాణం చేయకపోతే అధికారిక ఎమ్మెల్యేగా గుర్తింప రాదు. అందుకే ప్రమాణ స్వీకారానికి తప్పనిసరిగా వెళ్తారంటున్నారు.