Cm Jagan Review: అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత... సీఎం జగన్ సమీక్ష... ప్రతి ఎకరానికి ఇ–క్రాపింగ్ చేపట్టాలని ఆదేశం
అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. వాలంటీర్ల పనితీరుపై సీఎం కీలక ఆదేశాలిచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందనపై కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో ఇళ్ల నిర్మాణం, జగనన్న శాశ్వత గృహహక్కు పథకంపై సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు, ఆర్బీకేల నిర్మాణాలపై సీఎం జగన్ ఆరా తీశారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలపై సమీక్షలో సీఎం జగన్ చర్చించారు. రబీ పంటల సన్నద్ధతపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత
అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఉపాధిహామీ పనులపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మెటీరియల్ కాంపొనెంట్ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల గ్రామ సచివాలయాల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఈ పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమాలు ఉంటాయని సీఎం అన్నారు. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఇ-క్రాపింగ్ తప్పనిసరి
పంట కొనుగోలు జరగాలంటే ఇ– క్రాపింగ్ లో నమోదు చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇ– క్రాపింగ్ ఆర్బీకేల ప్రాథమిక విధి అన్నారు. ఇ– క్రాపింగ్‌పైన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. రైతులకు ధరల పట్ల అభ్యంతరం ఉంటే సీఎం యాప్ ద్వారా పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామంలోని ప్రతి ఎకరానికి కూడా ఇ–క్రాపింగ్ చేపట్టాలన్నారు. పంటలబీమా, సున్నా వడ్డీ, పంట కొనుగోళ్లు, ఇన్‌పుట్ సబ్పిడీకి ఇ-క్రాపింగ్ ఉండాలన్నారు. ప్రతి నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల స్థాయిలో, రెండో శుక్రవారం మండలస్థాయిలో, మూడో శుక్రవారం జిల్లాల స్థాయిలో అడ్వైయిజరీ సమావేశాలు జరగాలని సీఎం జగన్ సూచించారు. నాలుగో శుక్రవారం వ్యవసాయశాఖ కార్యదర్శి సమక్షంలో రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశాల్లో వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
Also Read: ఏపీ రాజకీయ నేతలు త్వరలో అలా చేయబోతున్నారట ! ఇదే ఆర్జీవీ జోస్యం
కౌలు రైతులకు పంట రుణాలు
కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చామన్న సీఎం జగన్... వారికి పంట రుణాలు అందేలా చూడాలన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా సహా అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని తెలిపారు. ఇన్‌పుట్‌సబ్సిడీ , బీమాతో పాటు పంట కొనుగోలుకు కూడా భరోసా ఇస్తున్నామన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని సూచించారు. ఈ విషయంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. రబీకి అవసరమైన విధంగా సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు.
Also Read: సీఎంనా ? సజ్జలనా ? ఎవరిని ఉద్దేశించి పట్టాభి " ఆ పదం " వాడారు ?. పూర్తి ప్రెస్‌మీట్ డీటైల్స్ ఇవిగో..
గృహ హక్కు పథకం ద్వారా 47.4 లక్షల మందికి లబ్ధి
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్షించారు. 100 ఏళ్ల తర్వాత సర్వే, రికార్డులను అప్‌డేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా రూపుమాపేందుకు ఈ సర్వే చేపట్టామన్నారు. గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటుందన్న సీఎం పైలట్‌ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో ఈ సర్వే జరుగుతుందన్నారు. మరో 650 గ్రామాల్లో డిసెంబర్ కల్లా సర్వే పూర్తవుతుందన్నారు. 2023 జూన్‌కల్లా మొత్తం సర్వే ముగుస్తుందని అధికారులు సీఎంకు వెల్లడించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సమీక్షించిన సీఎం... ఈ పథకం ద్వారా 47.4 లక్షల మంది లబ్ధి పొందుతారన్నారు. పట్టాలు లబ్ధిదారులకు చేరితేనే భూములపై అన్నిరకాల హక్కులు వస్తాయన్నారు. ఈ పథకంమీద క్రమం తప్పకుండా సీఎస్ కూడా రివ్యూ చేస్తారని సీఎం చెప్పారు. డిసెంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు.
Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!
మార్పురాకపోతే తొలగించండి
గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తనిఖీలప్పుడు రిజిస్టర్ పరిశీలన తప్పనిసరి చేయాలన్నారు. గతంలో వ్యక్తంచేసిన సమస్యలను పరిష్కరించామా? లేదా? అనేది తప్పకు చూడాలన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రోటోకాల్‌ను తయారుచేయాలన్నారు. ఆ ప్రోటోకాల్‌ను పాటిస్తున్నారా? లేదా? కచ్చితంగా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. 80 శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనపరుస్తున్నారని, మిగిలిన 20 శాతం మంది సచివాలయాల సిబ్బందికి కూడా పనితీరును మెరుగుపరిచూకోవాలన్నారు. వాలంటీర్లు మెరుగైన సేవలు అందించేందుకు వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. వాలంటీర్లు పనితీరు మెరుగుపర్చుకునేందుకు చేయూతనివ్వాలన్నారు. పనితీరులో మార్పురాకపోతే వారిని తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను భర్తీచేయాలని ఆదేశించారు.