Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు
Weather Updates : బంగాళాఖాతంలో రుతుపననాలు చురుగ్గా విస్తరిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.
Weather Updates : బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) చురుగ్గా విస్తరిస్తున్నాయి. దీంతో రాగల రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం(Bay Of Bengal), అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ(Kerala), కర్ణాటకతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల(Telugu States)కు ఈసారి ముందస్తుగా రుతుపవనాలు చేరే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం జిల్లాల్లోని చాలా చోట్ల రుతుపవనాల కారణంగా వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో ఏపీ(Andhra Pradesh)లో ఉరుములతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలో
తెలంగాణలో ఈ నెల 22వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళఖాతంలోని పలు ప్రాంతాలకు, మొత్తం అండమాన్ నికోబార్ దీవులకు, అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవానలు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర- దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరట్వాడ, కర్నాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణశాఖ పేర్కొన్నది.
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో 8.11 సెంటిమీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా దోమలో 5.08 సెం.మీ, నారాయణపేట జిల్లా కృష్ణలో 4.75 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం పగటి ఉష్ణోగ్రతలు 19 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 41.9 డిగ్రీల సెంటిగ్రేడ్, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా చిట్యాల 41.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ 41.4 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.