Chandrababu: ఏపీలో వర్షాలు, వరదలపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు - చంద్రబాబు
Heavy Rains in Andhra Pradesh | ఏపీలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
AP CM Chandrababu | ఏపీలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ వర్షపాతం (Rains In AP) నమోదైందని.. విజయవాడ, గుంటూరులో వెంటనే చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాలు, వరదల నేపథ్యంలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందన్నారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు అధికారులతో వర్షాలపై తాజా పరిస్థితిని ఆరాతీశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ‘విజయవాడలో కొండచరియలు పడి చనిపోవడం బాధాకరం. వర్షాలు, వరదల్లో 9 మంది చనిపోయారు, ఒకరు గల్లంతయ్యారు. కాజా, టోలేట్, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉంది అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం.
ఏపీలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
రాష్ట్రంలో గరిష్టంగా 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగ్గయ్యపేటలో 26.1 సెంటీమీటర్ల వర్షపాతం, తిరువూరులో 26 సెంటీమీటర్లు, గుంటూరులో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్ష జరిపి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. అధికారులు కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని మానిటర్ చేయడం వల్ల ప్రాణనష్టం అధికం కాకుండా, చూడగలిగామన్నారు. కానీ విజయవాడలో కొండ చరియలు విరిగిపడటం, గుంటూరులో కారు కొట్టుకుపోవడం ఇలాంటి ఘటనలతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అన్నారు.
భారీ వర్షాలతో అన్ని జలాశయాలు నిండిపోయాయి. అన్ని నిండితే వరద నీళ్లు ఎక్కువగా వస్తాయి. శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చి నాగార్జున సాగర్ నిండింది, ఆపై పులిచింతలలో పూర్తి స్థాయికి చేరింది. లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి 8 లక్షల 90 వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఇది 10 లక్షలకు చేరుతుంది.
Also Read: చంద్రబాబు పాలిటికల్ కెరీర్ హైలైట్స్, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు - అప్పట్లోనే విజన్ 2020
తెలుగు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
ఏపీ, తెలంగాణ మధ్య అటు రోడ్డు మార్గంతో పాటు ఇటు రైలు మార్గంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. విజయవాడ - కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. భారీ వరదలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వేట్రాక్ ధ్వంసమైంది. ఇంటికన్నె, కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ కింద మట్టి, కంకర కొట్టుకుపోవడంతో ట్రాక్ కింద నుంచి, ట్రాక్ పైనుంచి సైతం వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. మచిలీపట్నం, సింహపురి రైళ్లు మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ఐతవరం వద్ద నీటి ప్రవాహం ఉధృతం కావడంతో ఇదివరకే రైలు సర్వీసులు నిలిపివేయగా.. బస్సులను సైతం తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. బస్సులు వెళ్లకపోవడంతో విజయవాడ బస్టాండ్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు.