Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే
PM Modi in Gannavaram Airport: మోదీ హెలికాప్టర్ వెళుతున్న సమయంలోనే ఆకాశంలో నల్లబెలూన్లు కూడా ఎగురుతూ కనిపించాయి. దీంతో భద్రతా లోపంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి.
ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో నల్ల బెలూన్లు కలకలం రేపాయి. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటుగా ప్రజాప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మోదీ ఎయిర్ పోర్ట్ లోనే ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆర్మీ హెలికాప్టర్ లలో భీమవరం వెళ్లారు. అయితే ఇదే సమయంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగిరాయి.
మోదీ హెలికాప్టర్ వెళుతున్న సమయంలోనే ఆకాశంలో నల్లబెలూన్లు కూడా ఎగురుతూ కనిపించాయి. దీంతో భద్రతా లోపంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ పర్యటిస్తుంటే, భద్రతా బలగాలు ఆయా ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకొని భద్రతను పర్యవేక్షిస్తుంటాయి. అలాంటిది గాల్లోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బెలూన్లు ఎరగవేసి నిరసన తెలపటంపై అధికారుల్లో కూడా కలవరం మెదలైంది. వెంటనే అప్రమత్తం అయిన భద్రతా బలగాలు బెలూన్లు ఎగరవేసిన వారి కోసం గాలింపు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
మండిపడ్డ బీజేపీ
గన్నవరం విమానాశ్రయం సమీప ప్రాంతం నుండి కొన్ని దుష్ట శక్తులు ప్రమాదకర బెలూన్లు ఎగరవేయడం పట్ల రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ సంఘటన వెనక సూత్రధారులు పాత్రధారులు కుట్ర అమలు చేసిన దుష్టశ్తులను వెంటనే గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు సోము వీర్రాజు తెలిపారు.
నల్లబెలూన్లతో కాంగ్రెస్ నిరసన
ఆంధ్రప్రదేశ్ లో మోదీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. విభజన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని, రాజదాని శంకుస్థాపనకు వచ్చిన తరవాత మోదీ ఏపీని కనీసం పట్టించుకోలేదని, నీరు మట్టి ఇచ్చి, ఏపీ ప్రజల నోట్లో మట్టి కొట్టారంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మోదీకి వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగా రాజమండ్రిలో ఉన్న పీసీసీ అద్యక్షుడు శైలజానాథ్ ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇక గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద కూడ కాంగ్రెస్ మహిళా విభాగం నాయకురాలు సుంకర పద్మశ్రీ నల్లబెలూన్లతో ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అమెతో పాటుగా పార్టీ కార్యకర్తలు పలువురిని అరెస్ట్ చేశారు.