Kodali Nani: జగన్‌ను రాళ్లతో కొట్టాలని నిన్న బాబు కామెంట్స్, వెంటనే సీఎంపై దాడి - కొడాలి నాని
AP Latest News: రాయి దాడి నుంచి జగన్ దేవుడు దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే గాయంతో బయటపడ్డారని కొడాలి నాని అన్నారు. జగన్ కు బ్లాక్ క్యాట్ కమాండోలతో సెక్యూరిటీ ఇవ్వాలని అన్నారు.
Kodali Nani on Chandrababu Naidu: సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో జగన్ పై దాడులు జరిగాయని.. ఇప్పుడు కూడా అదే తరహాలో దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రాణాపాయం ఉన్న సీఎం జగన్ కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ‘‘పనికిమాలిన వారికి బ్లాక్ క్యాట్ కమాండోలను ఇస్తారు. ముఖ్యమంత్రి జగన్ కు ఇవ్వరా’’ అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.
‘‘పక్కా వ్యూహంతోనే సీఎం జగన్ పై దాడి జరిగింది. సైకో చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు చెప్పారు. కులోన్మాదంతో ముదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు మాటలు విని సీఎం జగన్ ను చంపడానికి ప్రయత్నించారు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారంగా గురి చూసి.. కొట్టాలని ప్రయత్నం చేశారు. ప్రచారంలో సీఎం జగన్ కదలికల వల్ల గురితప్పి కన్ను వద్ద తగిలింది.
దేవుడు దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారు. దాడిని ఖండించాల్సిన టీడీపీ పెద్దలు సంస్కారహీనంగా సీఎం జగనే తనపై దాడి చేయించుకున్నారని చెప్తున్నారు. గుర్తింపు పొందిన 9 సంస్థలు చేసిన సర్వేల్లో 125 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలు వైసీపీకే వస్తాయని చెప్తున్నాయి. అందుకే
జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఏమీ చేయలేని కొందరు రాజకీయ నిరుద్యోగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిసి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశాయి. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయడానికి ప్రయత్నం జరిగిందంటే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు. ఎంతో పక్కాగా దాడి చేయబట్టే.... సీఎం జగన్ కు తగిలిన రాయి, వెల్లంపల్లికి కూడా తగిలి ఆయన గాయపడ్డాడు. ప్రధాని, సీఎం స్థాయి వ్యక్తులు రోడ్ షో గా వెళ్లేటప్పుడు పగలైనా రాత్రయినా కరెంటు తీసేస్తారు. ఆ విషయం సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియదా? బస్సుపై ఆయన రోడ్ షోలు చేసినప్పుడు కరెంటు తీయలేదా? సీఎం జగనే కావాలని కరెంటు తీయించారని పిచ్చివాగుడులు వాగుతున్నారు. అధికారులపై యాక్షన్ తీసుకోవాలంటూ చంద్రబాబు 420 వ్యాఖ్యలు చేస్తున్నాడు’’ అని కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు.