Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ దూకుడు! నిందితులుగా మరో నలుగురు
ఈ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు ఏ - 1గా, మాజీ మంత్రి పి. నారాయణ ఏ - 2గా, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఏ - 14గా ఉన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులుగా ఉండగా, మరో ఐదుగురి పేర్లను ఏపీ సీఐడీ తాజాగా నిందితులుగా చేర్చింది. ఈ నలుగురి పేర్లను సోమవారం చేరుస్తూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది.
ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు ఏ - 1గా, మాజీ మంత్రి పి. నారాయణ ఏ - 2గా, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఏ - 14గా ఉన్నారు. తాజాగా, నారాయణ భార్య రమాదేవిని ఏ - 15గా, రావూరి సాంబశివరావు ఏ-16, ఏ - 17గా ఆవుల మణిశంకర్, ఏ-18గా ప్రమీల, వరుణ్‌కుమార్ కొత్తాపును ఏ - 19గా సీఐడీ చేర్చింది.
కొత్తగా సీఐడీ చేర్చిన నిందితులు ఎవరంటే..
మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి (ఏ-15)తో నారాయణ కాలేజీ ఉద్యోగి ధనుంజయ్ భార్య ప్రమీల (ఏ - 18), నారాయణ బంధువు ఆవుల మణి శంకర్ (ఏ - 17), నారాయణ భార్య రమాదేవి బంధువు రాపూరి సాంబశివరావు (ఏ - 16), వరుణ్ కుమార్ కొత్తాపు అనే వ్యక్తి పేర్లు కేసులో చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. క్రైం నంబర్ 16/2021 గా ఇప్పటికే ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సెక్షన్ 120(b), 409, 420, 166, 167, 34, 35, 37, 218 IPC, 13(2), 13(1) ఆఫ్ పీసీ యాక్ట్ గా కేసు నమోదు చేసింది.
ఈ కేసుకు సంబంధించి నారా లోకేష్‌కు, నారాయణకు విచారణకు తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు వేయగా.. ఏపీ హైకోర్టు నేడు ఆ పిటిషన్‌ను కొట్టేసిన సంగతి తెలిసిందే.