Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన గడువు పెంపు, ఎన్ని రోజులంటే?
Videshi Vidya Divena: జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు గడువును ఏపీ సర్కారు పొడిగించింది. అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
Videshi Vidya Divena: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువును పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 30 వ తేదీ వరకు విదేశీ విద్యాదేవెన కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సర్కారు తెలిపింది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్ష వర్ధన్ శనివారం వివరాలు వెల్లడించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్లి పేరుపొందిన విశ్వ విద్యాలయాల్లో గొప్ప చదువులు చదవాలన్న గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు హర్ధ వర్ధన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ(అగ్ర వర్ణాలకు చెందిన పేదలు), దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చుద. ఈ విద్యా దీవెన పథకానికి దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30 వ తేదీ వరకే ఉండగా..ఆంధ్రప్రదేశ్ సర్కారు అక్టోబర్ 30వ తేదీ వరకు గడువు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యా దీవెన పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 392 దరఖాస్తులు వచ్చాయన, అయితే ఈ పథకంలో మరింత మందికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే వైసీపీ సర్కారు దరఖాస్తు గడువు పెంచుతూ అవకాశం కల్పించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుండి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులు జగనన్న విద్యా దేవెన పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఒకటి నుండి 100 ర్యాంకుల్లో ఉండే విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువు కోసం కోటి రూపాయలైనా ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి స్థాయిలో రీయంబర్స్ చేస్తుంది. 101 నుండి 200 లోపు క్యూఎస్ ర్యాంకులు ఉండే విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ. 50 లక్షల వరకు ఫీజు రీయంబర్స్ చేస్తుంది.
అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే కుటుంబాల ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షలకు మించకూడదు. వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. అలాగే విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్న ఎంత మంది విద్యార్థులకు అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఫీజు రియంబర్స్ చేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్ష వర్ధన్ వివరాలు వెల్లడించారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. అలాగే డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ప్రపంచంలో టాప్ 100 లోపు ర్యాంకు ఉన్న విశ్వ విద్యాలయాలు, విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. అలాగే 100 నుండి 200 లోపు ర్యాంకు కలిగిన వాటిల్లో అడ్మిషన్ పొందితే రూ. 50 లక్షలు.. 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుంది.