CM Jagan Meet : బీసీ నేతలతో సీఎం జగన్ సమావేశం, హాజరు కావాలంటూ సీఎంవో నుంచి ఫోన్లు!
బీసీ నేతలు సీఎం జగన్ రేపు(శనివారం) సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి నేతలకు కాల్స్ వెళ్తున్నాయి.
బీసీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగే సమావేశానికి సీఎం జగన్ అధ్యక్షత వహిస్తారు. వీకెండ్ లో సాధారణంగా సమావేశాలకు దూరంగా ఉండే జగన్ కులాల వారీగా సమావేశాలను నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బీసీ వర్గాలతో జగన్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
రేపే సమావేశం
రేపు సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్య నేతల సమావేశానికి జగన్ టైం ఫిక్స్ చేశారు. ఇప్పటికే పార్టీ వర్గాలకు ఈ మేరకు సమాచారాన్ని అందించారు. ఈ సమావేశానికి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి పలువురికి ఫోన్ లు కూడా వెళ్లినట్లు సమాచారం. బీసీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఈ సందర్బంగా చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ జరుగుతుందని చెబుతున్నారు. బీసీ నేతలతో గతంలో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ కూడా జరిగింది. అంతే కాదు ఇటీవలే తాడేపల్లి కేంద్రంగా బీసీ వర్గాల సమావేశం జరిగింది. ఇందులోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీసీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేసిన మంత్రులు, బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేసిన సర్కార్ గా సీఎం జగన్ ను కొనియాడారు.
ఇప్పుడే సమావేశం ఎందుకు ?
సీఎం జగన్ టార్గెట్ 175 నియోజకవర్గాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయటం, ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లతో గడప గడప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గడప..గడపకు వెళ్లిన ఎమ్మెల్యేల పని తీరును ఆధారంగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపులు ఉంటాయని జగన్ స్పష్టం చేశారు. అంతే కాదు పార్టీ పరంగా నేతల పనితీరు ఎలా ఉంది, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను గురించి ఇప్పటికే పార్టీ నేతలతో జగన్ డైరెక్షన్ ఇస్తున్నారు. దీంతో పాటుగా నియోజకవర్గాల వారీగా పర్యవేక్షకుల నియామకం చేపట్టారు. ఇలా అన్ని కోణాల్లో కూడ పార్టీని, ప్రభుత్వాన్ని కలిపి ముందుకు నడిపించే క్రమంలో అన్ని మార్గాలను కూడ జగన్ అన్వేషిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే 175 నియోజకవర్గాల్లోని శాసన సభ్యులు, ఇంచార్జ్ లతో జగన్ సమావేశం అయ్యారు. నియోజకవర్గాల వారీగా విడి విడిగా పార్టీ నేతలు, ముఖ్యులతో ప్రతివారం జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు.వీటితో పాటు ఇప్పుడు కులాల వారీగా సమావేశాలకు సీఎం జగన్ రెడీ అయ్యారు.
ఎన్నికలపై దృష్టి
ఎస్సీ,ఎస్టీ ఓటు బ్యాంక్ తో పార్టీకి ఢోకా ఉండదని భావిస్తున్న తరుణంలో అత్యంత కీలకమైన బీసీ వర్గాలను పార్టీకి దగ్గర చేసేందుకు అవసరం అయిన అన్ని మార్గాలను సీఎం జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీసీ వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్యకు ఇప్పటికే రాజ్యసభ ఎంపీని చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అంటూ విమర్శలు వచ్చినప్పటికీ బీసీ వర్గాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతలో జగన్ తీసుకున్ననిర్ణయం సంచలనంగా మారింది. ఇప్పుడు బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, ముఖ్య నేతలు వరకు అందరితో జగన్ సమావేశం కావటం వెనుక ఎన్నికల వ్యూహమే కారణమని చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా జరిగే సమావేశాల్లో సీఎం జగన్, ఎన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయనే విషయాలను స్పష్టంగా చెబుతున్నారు. దీంతో పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లటంతో పాటు ,కులాల వారీగా సమీకరణాలు పార్టీని ఉపయోగపడేలా జగన్ వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.