Summer Forecast : ఏపీలో ఈ ఏడాది ఎండలు ఎక్కువే - విపత్తుల నిర్వహణ శాఖ అలెర్ట్
Summer Forecast : ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. దీంతో ఉపశమన చర్యలపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పలు సూచనలు చేసింది.
Summer Forecast : వడగాలులు, ఉపశమన చర్యలపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేడ్కర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సీజనల్ ఔట్ లుక్-2023 ప్రకారం ఈ వేసవిలో... వాతావరణంలోని మార్పులు, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, సముద్రానికి దగ్గరగా ఉండటం వలన ఏపీలో వడగాల్పులు ఎక్కువగా వీస్తాయని తెలిపారు. అలాగే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టం చేశారు. ఐఎండీ అంచనా ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపారు. ఎన్డీఎంఏ మార్గదర్శకాల ప్రకారం వడగాల్పులపై ప్రణాళిక విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించనుంది. దీనిలో ప్రభుత్వ శాఖల వారీగా అమలు చేయనుంది. 2016లో 723 , 2017లో 236, 2018లో 8, 2019లో 28 వడగాల్పుల మరణాలు నమోదు అయ్యాయి. విపత్తుల సంస్థ, జిల్లా యంత్రాంగం సమన్వయ చర్యలతో 2020, 21, 22లో వడగాల్పుల మరణాలు అసలు సంభవించలేదని అధికారులు తెలిపారు. జిల్లాల్లోని సంబంధిత శాఖల అధికారులు ఈ సంవత్సరం అదే కృషితో ప్రాణనష్టం లేకుండా ఉండేట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు, ప్రభుత్వ శాఖల అధికారులకు విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీచేసింది.
సూచనలు
- జిల్లా, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.
- బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, పని ప్రదేశాల్లో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ప్రారంభించే విధంగా NGOలు, కమ్యూనిటీ గ్రూప్స్, ఇతర సంస్థలను కోరాలి.
- బహిరంగ ప్రదేశాల్లో అవగాహన పోస్టర్‌లను ప్రదర్శించడం, టీవీల్లో స్క్రోలింగ్ చేయడం, థియేటర్‌లలో వీడియోలు ప్లే చేయడం, కరపత్రాల పంపిణీ మొదలైన వాటి ద్వారా వడగాల్పుల సమాచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
- క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయల్లో పోస్టర్లతో అవగాహన కల్పించాలి
- వడగాల్పుల తీవ్రతను బట్టి పాఠశాల సమయాలను మార్పు లేదా మూసివేయాలి.
- వైద్య శిబిరాలు నిర్వహించడం, ORS ప్యాకెట్లు, ఇతర మెడిసిన్లు తగినంత స్టాక్ ఏర్పాటు చేసుకోవాలి .
- కీలకమైన సౌకర్యాలకు (ఆసుపత్రులు, UHCలు వంటివి) నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యుత్ సంస్థలను కోరారు.
ఎండాలు, వర్షాలు కూడా
అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విభాగాన్ని విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగానికి నాలుగు రోజుల ముందు హీట్ ఇండెక్స్, రెండు రోజుల ముందుగా ఉష్ణోగ్రత వివరాలు, వడగాలుల తీవ్రతపై సూచనలు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఐఎండీ సూచనల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ప్రాణనష్టాన్ని తగ్గిస్తుందన్నారు. వడగాల్పుల తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విపత్తుల సంస్థ హెచ్చరిక సందేశాలు ప్రజలకు పంపనున్నట్లు చెప్పారు. ఎండలతోపాటు అప్పుడప్పుడు క్యుములోనింబస్ మేఘాల వలన వర్షాలతో పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.