AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం.. కొత్తగా 10 వేలకుపైగా కేసులు నమోదు..
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొత్తగా ఏపీలో 10,057 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
మహమ్మారి కరోనా ఆంధ్రప్రదేశ్ లో కల్లోలం సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో 10,057 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 21,24,546 పాజిటివ్ కేసులు.. నమోదయ్యాయి. 20,65,089 మంది డిశ్ఛార్జి అయ్యారు. వైరస్ కారణంగా 14,522 మంది మరణించారు. ప్రస్తుతం 44,935 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 19/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 19, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,24,546 పాజిటివ్ కేసు లకు గాను
*20,65,089 మంది డిశ్చార్జ్ కాగా
*14,522 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 44,935#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/nTVqy7nWph
నైట్ కర్ఫ్యూ అమలు
ఏపీలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 31వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ ఆంక్షల నుంచి ఆసుపత్రులు, మెడికల్ షాపులు, వైద్యులు, మెడికల్ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్లు, పెట్రోలు బంకులు, ఐటీ సర్వీసులు, అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. గర్భిణులు, చికిత్స పొందుతున్న రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి ప్రయాణాలు చేసేవారికి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది. సరకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్ వేదికల్లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరిగితే రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలుచేయాలని, సీటు విడిచి సీటు మార్కింగ్ చేయాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, కార్యక్రమాల్లో 200 మంది మించరాదని షరతులు విధించింది. ఆర్టీసీతో సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశించింది.
Also Read: AP Night Curfew: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు
Also Read: CS Sameer Sharma: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు