Kadem project Repairs Complete | మరమ్మతులు పూర్తి చేసుకున్న కడెం ప్రాజెక్టు
బీఆర్ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టు భద్రతను, నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన కాంగ్రెస్.. తాము అధికారం చేపట్టగానే 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. మెకానికల్ పనులకే 5 కోట్ల రూపాయలకు టెండర్లు రావడంతో, ఎలక్ట్రికల్ పనులకు మరో మూడు కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించింది. గేట్ల మరమ్మతులు, రోప్స్, కౌంటర్ వెయిట్స్, స్పిల్ వే, గండి పడిన ఎడమ కాలువ పనులు మూడు నెలలుగా జరుగుతున్నాయి. వర్షాలు ప్రారంభం కావడంతో పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇది నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్. ప్రస్తుతం ఇది డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. అయితే ప్రస్తుతం నీటిమట్టం 671 అడుగులకు చేరుకుంది. గతేడాది భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండిన సమయంలో గేట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వరద నీరు ప్రాజెక్టుపై నుండి ప్రవహించింది. వరద ధాటికి ఆ సమయంలో కడెం ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని అధికారులూ, సమీప గ్రామాల ప్రజలూ భయపడ్డారు. ప్రాజెక్ట్ దిగువనున్న గ్రామాల ప్రజలను తరలించి, అధికారులు వేరే చోట ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత... పనిచేయని గేట్లను స్ధానిక యువకులు హ్యాండిల్ సహాయంతో ఎత్తారు. దీంతో ప్రాజెక్ట్ లో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టి, డ్యాం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది.