సౌత్‌పై ఇంత చిన్న చూపా మోదీజీ, ఏబీపీ సదర్న్ రైజింగ్ ఈవెంట్‌లో సీఎం రేవంత్
ఏబీపీ సదర్న్ రైజింగ్ సమ్మిట్ ముగిసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గానూ మారింది. అందుకు కారణం...తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి..ఈ వేదికగా చేసిన వ్యాఖ్యలే. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూనే...మోదీ సర్కార్‌పై ఎప్పుడూ లేని స్థాయిలో చాలా గట్టిగా విమర్శలు చేశారు. విమర్శలన్నీ ఒక ఎత్తైతే..ఆయన వినిపించిన ఓ వాదన మరో ఎత్తు. సౌత్, నార్త్ అనే టాపిక్ తీసుకొచ్చారు. మోదీ సర్కార్ దక్షిణాదిని చిన్న చూపు చూస్తోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కువ ట్యాక్స్ కట్టేది సౌత్ స్టేట్స్ అయినప్పుడు ఎందుకింత వివక్ష అని ఏబీపీ సదర్న్ రైజింగ్ ఈవెంట్‌లో తన గళం వినిపించారు. పైగా దీనికి ఓ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. తెలంగాణ రూపాయి ట్యాక్స్ కేంద్రానికి కడితే... తిరిగి కేంద్రం నుంచి వచ్చేది కేవలం 40 పైసలే అన్నారు. అదే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం ఏకంగా 6 నుంచి 7 రూపాయల రిటర్న్న్ ఇస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఈ వేదికపై సీఎం రేవంత్ మాట్లాడినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ జరుగుతోంది.