KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
సాక్షాత్తూ ముఖ్యమంత్రి వచ్చి మాజీ ముఖ్యమంత్రిని పలకరించారు. ప్రభుత్వాధినేత ప్రతిపక్షనేత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయినా, రెండు సార్లు సీఎం అయినా కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి తన దగ్గరకు వస్తున్నారని గమనించి లేచి నిలబడి ముఖ్యమంత్రికి ప్రతినమస్కారం చేశారు కేసీఆర్. అంతే కాదు రేవంత్ కు షేక్ హ్యాండ్ ను ముందుగా తనే ఆఫర్ చేసి హుందా తనాన్ని ప్రదర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఆసక్తికర సన్నివేశం ఇది. కేసీఆర్, రేవంత్ షేక్ హ్యాండ్ ఆసక్తికర అంశంగా మారిపోయింది. రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి ప్రతిపక్షనేత యోగక్షేమాలు కనుక్కున్న తీరు, ఆయన అనుభవానికి, వయస్సుకు రేవంత్ ఇచ్చిన మర్యాదపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక్కడివరకూ బాగానే ఉంది కానీ ఇదే సమయంలో కేటీఆర్, కౌశిక్ రెడ్డి కనీసం తమ స్థానాల్లో లేచి నిలబడకపోవటం, సభానాయకుడు సమీపానికి వచ్చినప్పుడు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవటంపై చర్చ నడుస్తోంది. ఇది కేటీఆర్ అహంకారాని మరో ఉదాహరణం అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటే...రేవంత్ డ్రామాలకు కేటీఆర్ పడడని...తన తండ్రి చావు కోరుకున్న వ్యక్తికి తను గౌరవం ఇవ్వడని బీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. మొత్తంగా కేసీఆర్, రేవంత్ ల అరుదైన కలయిక హాట్ టాపిక్ కావాల్సిన చోట...కేటీఆర్ సభానాయకుడి చర్యకు స్పందించకపోవటం కూడా అంతే స్థాయిలో చర్చకు కారణమవుతోంది.





















