ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్‌ఎస్ నేతలు ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. నిన్న లగచర్ల రైతులకు మద్దతుగా నల్ల చొక్కాలు, చేతులకు బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా 12వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిలదీశారు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చామని అన్నారు.