PBKS vs RCB Qualifier 1 Match Highlights | ఐపీఎల్ ఫైనల్ కు దూసుకెళ్లిన ఆర్సీబీ | ABP Desam
18ఏళ్ల కసి..ఆ కలను సాధించలేకపోతున్నామనే కోపం..పట్టుదల అన్నీ కలగలిపి పంజాబ్ మీద సునామీలా విరుచుకుపడిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ముల్లాన్ పూర్ లో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో టాస్ గెలిచి పంజాబ్ కి బ్యాటింగ్ అప్పగించిన ఆర్సీబీ..బంతి బంతికి బెంగుళూరు మాత రుణం తీర్చుకుంది. నిప్పులు చెరిగే బంతులతో హేజిల్ వుడ్, ఇన్ అండ్ ఔట్ స్వింగర్లతో భువనేశ్వ్, లైన్ అండ్ లెంగ్త్ తో యశ్ దయాల్, స్పిన్ ఉచ్చు వేసి బంతితో పాటు పంజాబ్ బ్యాటర్లను గిరా గిర్రా తిప్పిన సూయాశ్ శర్మ...పంజాబ్ పతనానికి కాదేదీ అనర్హం అన్నట్లు బెంగుళూరులో ఉన్న ప్రతీ బౌలర్ చెలరేగిపోయారు. పవర్ ప్లే ముగిసే సమయానికి సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్ ను ఏ దశలో కోలుకునేలా కనిపించ లేదు. ప్రియాంశ్ ఆర్యతో మొదలు పెట్టి అజ్మతుల్లా ఒమర్జాయ్ వరకూ ఎవ్వరూ పంజాబ్ ను కాపాడలేకపోయిన చోట 26 పరుగులు కొట్టిన స్టాయినిస్ టాప్ స్కోరర్ గా నిలిచిన చోట కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయిపోయింది పంజాబ్. అది కూడా ఇంకా 6 ఓవర్లు మిగిలి ఉండగానే. పడిన వికెట్లలో కూడా నాలుగు క్లీన్ బౌల్డ్ లు ఉన్నాయి. సుయాశ్ శర్మ, హేజిల్ వుడ్ మూడేసి వికెట్లు తీస్తే..యశ్ దయాల్ 2 వికెట్లు, భువీ, రొమారియో చెరో వికెట్ తీసుకున్నారు. ఇక 102 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీని పంజాబ్ కాస్త లైన్ అండ్ లెంగ్త్ తోఇబ్బంది పెట్టారు కానీ ఎక్కడా పరుగుల ప్రవాహాన్ని ఆపలేకపోయారు. కొహ్లీని 12 పరుగులకే ఔట్ చేసినా, మయాంక్ అగర్వాల్ 19పరుగులకే వెను దిరిగినా లక్ష్యం చాలా చిన్నది కావటంతో ఓపెనర్ ఫిల్ సాల్ట్ స్వేచ్ఛగా ఆడేశాడు. కేవలం 27 బాల్స్ లోనే 6 ఫోర్లు 3 సిక్సర్లతో 56పరుగులు చేసిన సాల్ట్ దగ్గరుండి 10 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసేలా ఆర్సీబీని నడిపించటంతో పాటు తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సీబీని ఫైనల్ కి తీసుకెళ్లాడు. ఇక ఆర్సీబీ చేతిలో కంగుతిన్న పంజాబ్ కు మరో ఛాన్స్ ఉంటుంది. ముంబై, గుజరాత్ ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో విజేతగా నిలిచే జట్టుతో క్వాలిఫైయర్ 2 లో తలపడనుంది పంజాబ్ కింగ్స్.





















