Mitchell Marsh 117 Runs vs GT IPL 2025 | 15ఏళ్ల కెరీర్ తర్వాత ఐపీఎల్ లో సెంచరీ కొట్టిన మిచ్ మార్ష్
లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయినా నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కి గట్టి షాక్ నే ఇచ్చింది. టాస్ గెలిచి కూడా పిలిచి మరీ లక్నోకు బ్యాటింగ్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ కి దిమ్మ తిరిగేలా LSG బ్యాటర్లు రెచ్చిపోయారు. ప్రధానంగా ఓపెనర్ మిచ్ మార్ష్ గురించి చెప్పుకోవాలి. ఇన్నింగ్స్ ను స్లోగా మొదలుపెట్టి హాఫ్ సెంచరీ తర్వాత గేర్లు మార్చి గుజరాత్ బౌలర్లను రఫ్పాడించాడు. ఈ సీజన్ లో తను కనబరుస్తున్న ఫామ్ ను మరింత ముందుకు తీసుకువెళ్తూ 33 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసిన మిచ్ మార్ష్...ఆ తర్వాత దూకుడును ఒక్కసారిగా పెంచి 56 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. మొత్తంగా 64 బంతుల్లో 117పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో ఏకంగా 10 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ ను అయితే టార్గెట్ చేసి మరీ ఒకే ఓవర్ లో రెండు సిక్సులు, మూడు ఫోర్లతో 24 పరుగులు రాబట్టాడు మార్ష్. మిచ్ మార్ష్ కు తోడుగా పూరన్ కూడా ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో ఏకంగా 235 పరుగులు చేసి గుజరాత్ కు 236 టార్గెట్ ను పెట్టి 202 పరుగులకే రిస్ట్రిక్ చేసి ఎలిమినేట్ అయినా టేబుల్ టాపర్ గుజరాత్ కు గట్టి షాక్ నే ఇచ్చింది. మిచ్ మార్ష్ కు ఐపీఎల్ కెరీర్ లో ఇదే ఫస్ట్ సెంచరీ. 2010 లో ఆస్ట్రేలియా జాతీయ జట్టు ఆడక ముందే డెక్కన్ ఛార్జర్స్ కు ఎంపికైన మిచ్ మార్ష్...అప్పటి నుంచి అడపాదడపా ఐపీఎల్ ఆడుతూనే ఉన్నా ఎప్పుడూ ఫుల్ ఫ్లెడ్జ్ గా సీజన్ మొత్తం ఆడలేదు. ఓ సీజన్ లో పది మ్యాచ్ ల కంటే ఎక్కువ ఆడటం కూడా మార్ష్ కు పదిహేనేళ్లలో ఇదే తొలిసారి. సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడిన మార్ష్ 5హాఫ్ సెంచరీలు, నిన్నటి సెంచరీతో కలిపి 560పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాడు. అన్నట్లుగా 2008 ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో మిచ్ మార్ష్ అన్నయ్య షాన్ మార్ష్ అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడుతూ రాజస్తాన్ రాయల్స్ పై సెంచరీ బాదాడు. మళ్లీ 17ఏళ్ల తర్వాత తమ్ముడు మిచ్ మార్ష్ సెంచరీ కొట్టాడు. అలా ఐపీఎల్ లో సెంచరీలు చేసిన తొలి అన్నదమ్ములుగా షాన్ మార్ష్, మిచ్ మార్ష్ సరికొత్త రికార్డును సైతం నెలకొల్పారు.





















