WI vs Pak 3rd ODI Highlights | ఘోరంగా కుప్పకూలిన పాక్..92పరుగులకే ఆలౌట్ | ABP Desam
వెస్టిండీస్ వన్డే క్రికెట్ లో ఈ రోజు మర్చిపోలేనిది. ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్లను వెంటాడుతున్న ఓ శాపం నేడు తొలగిపోయింది. 34 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పై వన్డే సిరీస్ ను గెలిచింది వెస్టిండిస్. ఇటీవలి కాలంలో పూర్ ఫామ్ తో రాను రాను పడిపోతున్న క్రికెట్ ప్రమాణాలతో విలవిలాడుతున్న వెస్టిండిస్ పాకిస్థాన్ తో తమ సొంత గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 42ఓవర్ల పాటు పాకిస్థాన్ కే ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. 42 ఓవర్లకు 184పరుగులు మాత్రమే చేసిన కరీబియన్ జట్టు 6వికెట్లు కోల్పోయింది. సరిగ్గా అక్కడే మ్యాచ్ మలుపు తిప్పాడు కెప్టెన్ షై హోప్. విండీస్ ఆశలను ఆకాశానికి తీసుకువెళ్తూ ఎడపెడా బౌండరీలతో మోత మోగించాడు. 94 బంతుల్లో 10 ఫోర్లు 5 సిక్సర్లతో 120పరుగులు చేశాడు. హోప్ కు మరో ఎండ్ లో రోస్టన్ ఛేజ్ కూడా సహకరించటంతో ఆఖరి 8ఓవర్లలో విండీస్ విధ్వంసం చేసి 110పరుగులు లాగేసింది. ఫలితంగా పాకిస్థాన్ ముందు 295పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆ టార్గెట్ ఛేజ్ చేయటంలో మన అద్భుతమైన పాకిస్తాన్ వీరులు విజ్ఞాన ప్రదర్శన చేశారు. జేడన్ సీల్స్ అనే విండీస్ కుర్ర బౌలర్ ధాటికి బెంబేలెత్తి పోయి ఘోరంగా 92పరుగులకే ఆలౌట్ అయిపోయారు. బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్, సయమ్ అయూబ్, షఫీఖ్ ఎవ్వరూ పాక్ ను ఆదుకోలేకపోయారు. 8పరుగులకే 3 వికెట్లు, 21కి పరుగులకు 4 అంటూ సాగిన్ పాక్ ప్రయాణం 92పరుగులకు ముగిసిపోయింది. జేడన్ సీల్స్ టాప్ 4 పాక్ ఆటగాళ్లను అవుట్ చేయటంతో పాటు మొత్తం 18పరుగులు మాత్రే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టి.. విండీస్ కు ఏకంగా 202 పరుగుల భారీ విజయాన్ని అందించేలా చేశాడు. ఫలితంగా విండీస్ 34ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పై వన్డే సిరీస్ ను గెలిచి చరిత్ర సృష్టించింది.





















