Rohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam
సిడ్నీ టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ లేడు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు అనేదే ఇప్పుడు పెద్ద చర్చ. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదో టెస్టు అయిన సిడ్నీ టెస్టు మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం లేదు. అతని బదులుగా జస్ ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్ లో పెర్త్ లో జరిగిన మొదటి టెస్టులోనూ బుమ్రానే కెప్టెన్సీ చేసి మ్యాచ్ ను గెలిపించాడు. ఆ తర్వాత సిరీస్ లో భారత్ కు విజయమనేదే లేకుండా పోయింది. ఈ ఫలితాల కారణంగానే కోచ్ గంభీర్ కు, కెప్టెన్ రోహిత్ శర్మకు మధ్య విబేధాలు వచ్చాయనే వార్తలు వచ్చాయి. రోహిత్ ను తప్పిస్తున్నారనే సమాచారం కూడా ముందే బయటకు వచ్చింది. అయితే టాస్ సమయంలో బుమ్రా మాట్లాడుతూ రోహిత్ శర్మ నే ఈ టెస్టు నుంచి దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకున్నట్లు చెప్పాడు. టీమ్ అవసరాల దృష్ట్యా రోహిత్ శర్మ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడని...తమ కెప్టెన్ ఇలా నిర్ణయం తీసుకోవటం తమ టీమ్ లో ఉన్న ఐకమత్యం ఏంటో చూపిస్తోందని చెప్పాడు బుమ్రా. రోహిత్ కు బదులుగా గిల్ జట్టులోకి వస్తే గాయపడిన ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్మెంట్. మరి నిజంగానే ఫామ్ లో లేడు కాబట్టి ఆటగాడిగా, కెప్టెన్ గా విఫలం అవుతున్నాడు కాబట్టి రోహిత్ తప్పుకున్నాడా లేదా బయటకు వచ్చిన వార్తల ప్రకారం ప్రదర్శన బాగోకపోవటంతో కోచ్ గంభీర్ కెప్టెన్ గా రోహిత్ ను తప్పించాడా చూడాలి. సిడ్నీ టెస్టు భారత్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశం కోసం శ్రీలంక, ఆస్ట్రేలియా వరకూ వెయిట్ చేయాలి. అక్కడ భారత్ కు అనకూల ఫలితాలు వస్తే డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం రోహిత్ ఉంటాడు లేదంటే సిడ్నీ టెస్టు తర్వాతనే ఫలితం ఆధారంగా హిట్ మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే సమాచారం జోరుగా వినిపిస్తోంది.